దేశంలోని ఆస్పత్రులు పరిశ్రమలుగా మారాయి

కరోనా సోకిన వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఆస్పత్రులు వారి బాధల్లో ఆదాయం వెతుక్కుంటున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. దేశంలోని ఆస్పత్రులు పరిశ్రమలుగా మారిపోయాయని వ్యాఖ్యానించింది. కొవిడ్‌ చికిత్స,కరోనా మృతుల అప్పగింత, కొవిడ్‌ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు

Updated : 19 Jul 2021 21:56 IST

దిల్లీ: కరోనా సోకిన వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఆస్పత్రులు వారి బాధల్లో ఆదాయం వెతుక్కుంటున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. దేశంలోని ఆస్పత్రులు పరిశ్రమలుగా మారిపోయాయని వ్యాఖ్యానించింది. కొవిడ్‌ చికిత్స, కరోనా మృతుల అప్పగింత, కొవిడ్‌ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు తదితర అంశాలను అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌ షాతో కూడిన ధర్మాసనం ఆస్పత్రులు, ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మేము ఆస్పత్రులను ప్రజలకు సేవ చేసే కేంద్రాలుగా చూడాలా? రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమగా చూడాలా అని ప్రశ్నించింది.

‘‘ఆస్పత్రులు భారీ పరిశ్రమలుగా మారాయి. మనుషులు బాధల్లో ఉంటే వారి నుంచి డబ్బు గురించి అభివృద్ధి చెందాలని భావిస్తున్నాయి. ఇలాంటి చర్యలను మేం అంగీకరించబోం. వెంటనే అలాంటి ఆస్పత్రులను మూసివేయండి. నాలుగు గదుల్లో చికిత్సలు అందిస్తున్న ఆస్పత్రులకు అనుమతులు రద్దు చేయండి. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయండి’’అని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. 

మరోవైపు చాలా ఆస్పత్రులు అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంపై జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ ఓ ఆస్పత్రిలో ఒక కరోనా బాధితుడు కోలుకొని మరుసటి రోజు డిశ్చార్జ్‌ కావాల్సి ఉండగా.. అదే రోజు అగ్నిప్రమాదం జరిగి సజీవదహనమయ్యాడని, మరో ఇద్దరు నర్సులు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఉదాహరించారు. ఇలాంటి విషాదకర ఘటనలు కళ్ల ముందే జరుగుతున్నాయని.. వీటికి కారణమవుతున్న ఆస్పత్రులు ప్రజలకు వైద్యం అందిస్తున్నాయా? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నడిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. 

ఆస్పత్రులు భద్రతా ప్రమాణాలు పాటించేలా చేయడంలో గుజరాత్ ప్రభుత్వం విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. ఆస్పత్రులు అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించడానికి గడువును జూన్‌ 2022 వరకు గుజరాత్‌ ప్రభుత్వం పొడిగించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అప్పటి వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గడువును పొడిగిస్తూ ఎందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని