India-Canada: భారత్-కెనడా దౌత్య వివాదం.. విదేశాంగ మంత్రుల రహస్య భేటీ..!

India-Canada Diplomatic Row: భారత్‌, కెనడా మధ్య దౌత్య వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Published : 11 Oct 2023 10:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Canada PM Justin Trudeau) చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్‌, కెనడా (India - Canada) విదేశాంగ మంత్రులు (Foreign Ministers) ఇటీవల అమెరికా (USA)లో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌లో కథనం వెలువడింది.

కొద్ది రోజుల క్రితం వాషింగ్టన్‌లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌ (S Jaishankar), కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ (Melanie Joly) రహస్య సమావేశంలో పాల్గొన్నట్లు సదరు కథనం పేర్కొంది. భారత్‌తో దౌత్య ఉద్రిక్తతలను తొలగించుకోవాలని కెనడా ప్రయత్నిస్తున్నట్లుు ఆ కథనం వెల్లడించింది. ఈ క్రమంలోనే దిల్లీ డిమాండ్‌ చేసినట్లుగా భారత్‌లో దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకున్నట్లు తెలిపింది. అయితే, ఈ రహస్య భేటీ గురించి ఇరు దేశాల విదేశాంగ శాఖల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

Israel - Hamas: పశ్చిమాసియా పోరులో ‘ఎవరెటు?’

భారత్‌తో దౌత్య వివాదాన్ని తాము ప్రైవేటుగా పరిష్కరించుకోవాలనుకుంటున్నామని ఇటీవల కెనడా విదేశాంగ మంత్రి మెలానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘మేం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. మా దౌత్యవేత్తల భద్రతకు మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. ఈ వివాదం పరిష్కారం కోసం ప్రైవేటు చర్చలు కొనసాగించాలనుకుంటున్నాం. ఎందుకంటే.. విషయాలు బహిర్గతం కానంతవరకు దౌత్యపరమైన చర్చలే ఉత్తమమైన మార్గమని మేం భావిస్తున్నాం’’ అని మెలానీ తెలిపారు. అటు, భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి ఇంకా పెరగాలని తమ దేశం కోరుకోవట్లేదని ట్రూడో కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

నిజ్జర్ హత్యపై చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మద్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అంతేగాక, తమ అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించింది. దౌత్యవేత్తల సంఖ్య విషయంలో కెనడా సమానత్వం పాటించాలని, భారత్‌లో వారి దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ క్రమంలోనే కెనడా దాదాపు 30 మంది దౌత్య సిబ్బందిని భారత్‌ నుంచి కౌలాలంపూర్‌/మలేసియా తరలించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని