POK: పీవోకేలో బ్రిటిష్‌ రాయబారి పర్యటన.. భారత్‌ తీవ్ర అభ్యంతరం

POK: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో బ్రిటిష్‌ రాయబారి పర్యటించడం చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Updated : 13 Jan 2024 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ (Pakistan)లోని బ్రిటన్ హైకమిషనర్‌ (British High Commissioner) జానె మారియట్‌ ఇటీవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK)లో పర్యటించారు. జనవరి 10న పీవోకేలోని మీర్‌పుర్‌ ప్రాంతానికి వెళ్లారు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

‘‘బ్రిటిష్‌ హైకమిషనర్‌, యూకే విదేశాంగ కార్యాలయ సిబ్బంది పీవోకేలో పర్యటించడాన్ని భారత్‌ తీవ్రంగా పరిగణించింది. మన దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే ఈ చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ ఉల్లంఘనపై మా ఆందోళనను దిల్లీలోని బ్రిటిష్‌ హైకమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాం. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగాలే’’ అని కేంద్ర విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

యెమెన్‌పై కొనసాగుతున్న క్షిపణుల దాడులు.. నౌకలు రావొద్దని అమెరికా హెచ్చరిక

జానె మారియట్‌ పీవోకే పర్యటనపై పాక్‌ మీడియా కథనాలు ప్రచురించింది. ‘‘బ్రిటన్‌లో పాక్‌ సంతతికి చెందినవారిలో 70శాతం మంది మీర్‌పుర్‌ నుంచే ఉన్నారు. అందుకే, ఆమె ఇక్కడ పర్యటించారు’’ అని పాక్‌ మీడియా పేర్కొంది. కాగా.. గతంలో పాక్‌లోని అమెరికా రాయబారి డొనాల్డ్‌ బ్లోమ్‌ కూడా పీవోకేలో పర్యటించిన విషయం తెలిసిందే.

గతేడాది సెప్టెంబరులో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లిన ఆమె.. అక్కడ కొన్ని సమావేశాలు నిర్వహించారు. దీనిపై అప్పట్లో భారత విదేశాంగ శాఖ అమెరికాకు అభ్యంతరం తెలియజేసింది. ప్రపంచ దేశాలు దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని