Published : 02 Aug 2021 19:13 IST

Corona Virus: ఇరాన్‌పై ‘డెల్టా’ పంజా‌.. కేసుల్లో కొత్త రికార్డు!

టెహ్రాన్‌: ప్రపంచంలోని చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కరోనా తిరగబెడుతోంది. డెల్టా వేరియంట్‌ పంజాతో కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఇరాన్‌లో భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కొవిడ్‌-19 మహమ్మారి మొదలైనప్పటి ఇప్పటివరకు ఎన్నడూలేనంతగా సోమవారం ఒక్కరోజే 37వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న దాదాపు 35వేలకు పైగా కొత్త కేసులు రాగా.. ఈ రోజు దేశవ్యాప్తంగా 37,189 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, కొత్తగా మరో 411 మరణాలు వెలుగుచూడటంతో మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 91,407కి చేరింది. డెల్టా వేరియెంటే ఇంతలా కేసులు పెరిగేందుకు ఆజ్యంపోసిందని, అలాగే, దేశంలో 40శాతం కన్నా తక్కువ మందే మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

రెండు వారాలు లాక్‌డౌన్‌ పెట్టాలని మంత్రి లేఖ

దేశ రాజధాని నగరమైన టెహ్రాన్‌ సహా పలు నగరాల్లోని ఆస్పత్రులు కొవిడ్‌ రోగులతో నిండిపోతుండటంపై ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఇరాన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సయీద్‌ నామకి ఆ దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీకి ఆదివారం రాసిన లేఖలో దేశంలో రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని కోరారు. కొవిడ్‌ నియంత్రణకు మిలటరీ సాయం కూడా తీసుకోవాలన్నారు. అయితే, దీనిపై ఖమేనీ ఇంకా స్పందించలేదు. మరోవైపు, ఇరాన్‌ జనాభాలో 4శాతం కన్నాతక్కువ మందికే వ్యాక్సినేషన్‌ పూర్తయింది. అనేకమంది ఫ్రంట్‌లైన్‌ వైద్య సిబ్బంది స్థానికంగా ఉత్పత్తి చేసిన టీకాలు లేదా చైనాకు చెందిన సినోఫార్మా టీకాను వేయించుకున్నారు. అయితే, ఇతర టీకాలతో పోలిస్తే సినోఫార్మా వ్యాక్సిన్‌ కొవిడ్‌ కట్టడి సామర్థ్యం తక్కువగానే ఉన్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశంలో ఉత్పత్తిచేసిన టీకా కరోనా నుంచి 85శాతం భద్రత కల్పిస్తుందని ఇరాన్‌ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఎలాంటి సమాచారం ఇంకా సమర్పించలేదు. వీటితో పాటు  కొవాక్స్‌ కార్యక్రమం కింద స్పుత్నిక్‌ వి‌, ఆస్ట్రాజెనికా టీకాలను కూడా దిగుమతి చేసుకుంటోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని