Gaganyaan: మిషన్‌ గగన్‌యాన్‌.. కీలక పరీక్షకు ఇస్రో సిద్ధం!

ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రోగ్రామ్‌లో వినియోగించే ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌-1 (TV-D1) వాహక నౌక తొలి పరీక్షను ఇస్రో శనివారం నిర్వహించనుంది.

Updated : 20 Oct 2023 18:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రయాన్‌-3 ప్రయోగం విజయంతో దూసుకెళ్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక పరీక్షకు సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రోగ్రామ్‌లో వినియోగించే ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌-1 (TV-D1) వాహకనౌక తొలి పరీక్షను శనివారం నిర్వహించనుంది. దీని ద్వారా ‘క్రూ ఎస్కేప్ వ్యవస్థ (Crew Escape System)’ పనితీరును పరీక్షిస్తారు. ఈ వాహకనౌకకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. అక్టోబర్‌ 21న ఉదయం 8 గంటలకు దీనిని నింగిలోకి తీసుకెళ్లి.. అందులోని క్రూ మాడ్యూల్‌ సముద్రంలో పడిపోయేలా చేస్తారు.

ఫెయిల్యూర్‌ మోడల్‌..

అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే గగన్‌యాన్‌ మిషన్‌ ప్రయోగాల్లో భాగంగా ఇస్రో కీలక పరీక్షలు చేపడుతుంది. ఇందులో భాగంగా మొదటగా క్రూ మాడ్యూల్‌ (Crew Module)లోని సిబ్బంది తప్పించుకునే వ్యవస్థ (Crew Escape System) పనితీరును పరీక్షిస్తోంది. మిషన్‌ ప్రయోగ క్రమంలో ఏదైనా వైఫల్యం తలెత్తితే దాని నుంచి సిబ్బంది సురక్షితంగా తప్పించుకునే లక్ష్యంతోనే ఈ పరీక్షను చేపడుతున్నారు. గగన్‌యాన్‌ మిషన్‌ సిద్ధమయ్యే నాటికి ఇటువంటి పరీక్షలు సుమారు 20వరకు చేయనున్నట్లు సమాచారం.

మన టెక్నాలజీని అమెరికా అడిగింది: ఇస్రో చీఫ్‌

ఒకే ఇంజిన్‌ ఉండే వాహకనౌక.. క్రూ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ను 17 కి.మీ. ఎత్తు వరకు మోసుకెళ్తుంది. అనంతరం కల్పితంగా అత్యవసర పరిస్థితిని సృష్టిస్తారు. దీనికోసం అబార్ట్‌ సిగ్నల్‌ను పంపిస్తారు. ఒకవేళ ఎస్కేప్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే.. రాకెట్‌ నుంచి క్రూ మాడ్యూల్‌ విడిపోతుంది. తర్వాత దానికున్న పారాచూట్‌ సాయంతో సముద్రంలో పడుతుంది. భారత నౌకాదళం సిబ్బంది దానిని ఒడ్డుకు చేరుస్తారు. ఈ ప్రయోగం మొత్తం 8.5 నిమిషాల వ్యవధిలో పూర్తికానున్నట్లు ఇస్రో అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని