NEET: నీట్‌ ఫలితాల్లో సత్తా చాటిన జమ్మూకశ్మీర్‌కు చెందిన రోజువారీ కూలీ

జమ్మూకశ్మీర్‌కు చెందిన 19 ఏళ్ల కుర్రాడు ఇటీవల వెలువడిన నీట్‌ యూజీ ఫలితాల్లో సత్తాచాటాడు. గత రెండేళ్లుగా రోజూవారీ కూలీగా పనిచేస్తున్న ఆ కుర్రాడు నీట్‌లో 601 మార్కులు సాధించిన తన కలను నెరవేర్చుకున్నాడు.  

Updated : 16 Jun 2023 05:47 IST

శ్రీనగర్‌: పేదరికంలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్యం కోసం విరామం ఎరుగకుండా శ్రమించిన ఆ కుర్రాడి చిన్ననాటి కల ఎట్టకేలకు నెరవేరింది. కుటుంబం పూటగడవటం కోసం కూలీ పనులకు వెళుతూనే చదవుకున్న ఆ కుర్రాడు తీవ్ర పోటీ ఉన్న పరీక్షలో సత్తా చాటాడు. దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా రాసిన నీట్‌ యూజీ పరీక్షలో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఉమర్‌ అహ్మద్‌ గనై అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంటున్నాడు. గత రెండేళ్లుగా రోజువారీ కూలీగా పనిచేస్తున్న ఉమర్‌ అహ్మద్‌ నీట్‌ ఫలితాల్లో 720 మార్కులకు గానూ 601 మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచాడు. 

ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్‌లతో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా పేరు చాలా మందికి సుపరిచితమే. ఎప్పుడు ఎలాంటి ఘటన చోటుచేసుకుంటుందో తెలియని ఆ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల ఉమర్‌ అహ్మద్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. తన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో రోజూ రూ.600 చొప్పున పక్క గ్రామాల్లో కూలీ పనులకు వెళుతూనే చదువు కొనసాగించాడు. గత రెండేళ్లుగా పొద్దున పూట కూలీగా.. సాయంత్రం వేళ పరీక్ష కోసం సన్నద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల వెలువడిన నీట్‌ పరీక్ష ఫలితాల్లో ఉమర్‌ మంచి స్కోర్‌ సాధించాడు. తన కల నెరవేరడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బంధువులు, చుట్టుపక్కలవారు సంతోషం వ్యక్తం చేస్తూ అతనికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉమర్‌ మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచింది. పొద్దున పూట కూలీగా పనిచేస్తూనే సాయంత్రం సమయాల్లో చదువుకున్నాను. ఈ రోజు నాకష్టానికి ప్రతిఫలం దక్కింది. కష్టపడి పనిచేయండి. అది ఎప్పుడూ వృథా కాదు’’ అని అన్నాడు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని