Leopard: బెంగళూరు వాసులను హడలెత్తించిన చిరుత మృతి

గత ఐదు రోజులుగా బెంగళూరులోని (Bengaluru) కొన్ని ప్రాంతాల్లో ఓ చిరుత సంచరిస్తోంది. అటవీ అధికారులు దాన్ని బంధించి రెస్క్యూ సెంటర్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. 

Published : 02 Nov 2023 02:08 IST

Image: AnkitD1501

బెంగళూరు: గత కొద్ది రోజులుగా బెంగళూరులోని (Bengaluru) వీధుల్లో సంచరిస్తూ ఓ చిరుత స్థానికులను హడలెత్తించింది. పలు ప్రాంతాల్లో చిరుత తిరుగుతున్న సీసీటీవీ దృశ్యాలు చూసి స్థానికులు అందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలిసి అటవీ, పోలీసుశాఖ అధికారులు సుమారు 70 మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. చిరుతను బంధించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం చిరుత కుడ్లు గేట్‌ ఏరియా వద్ద తారసపడింది. దాన్ని వలతో బంధించిన తరువాత పశువైద్యుడు మత్తుమందు ఇస్తుండగా అది అకస్మాత్తుగా దాడి చేసింది. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత చిరుతను కట్టడి చేసేందుకు మత్తుమందు నింపిన గన్‌ను పేల్చారు. దాంతో స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే దానిని బన్నెరఘట్ట రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. అక్కడ పశువైద్యులు చికిత్స అందజేస్తుండగా మృతిచెందింది. 

దుబాయ్‌ నుంచి 47సార్లు లాగిన్‌.. మహువా మొయిత్రా కేసులో కీలక విషయాలు..!

ఈ చిరుత గత శనివారం తొలిసారి ఎలక్ట్రానిక్‌ సిటీకి సమీపంలోని సింగసంద్ర ప్రాంతంలో కన్పించింది. దానిని రెండు వీధి కుక్కలు వెంబడిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో వైరలైన నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసు, అటవీశాఖ అధికారులు ఓ బృందంగా ఏర్పడి చిరుత కోసం గాలించారు. అక్టోబరు 29న అది కుడ్లులోని ఓ అపార్ట్‌మెంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. సుదీర్ఘంగా గాలించి ఎట్టకేలకు దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. కాగా.. చిరుత తొలిసారి కన్పించిన సింగసంద్ర ప్రాంతం బెంగళూరు బన్నెరఘట్ట నేషనల్‌ పార్క్‌కు దగ్గరలో ఉంటుంది. చిరుత అక్కడి నుంచే వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు