Sharad Pawar: గవర్నర్‌ తన హద్దులన్నీ దాటారు.. శరద్‌ పవార్‌ విమర్శలు

ఛత్రపతి శివాజీపై గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ(Bhagat Singh Koshyari) చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌(Sharad pawar) మండిపడ్డారు.

Published : 24 Nov 2022 15:47 IST

ముంబయి: ఛత్రపతి శివాజీపై గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ(Bhagat Singh Koshyari) చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌(Sharad pawar) మండిపడ్డారు. గవర్నర్‌ అన్ని హద్దులూ దాటారని విమర్శించారు. అలాంటి వ్యక్తులకు కీలక పదవులు ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. గత వారం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శివాజీ మహారాజ్‌ పాత రోజులకే ఓ ఐకాన్‌ అంటూ గవర్నర్‌ కోశ్యారీ చేసిన వ్యాఖ్యల పట్ల ఎన్సీపీతో పాటు ఉద్ధవ్‌ సారథ్యంలోని శివసేన వర్గం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం శరద్‌ పవార్‌ ముంబయిలో మీడియాతో మాట్లాడారు. ఛత్రపతి శివాజీ గురించి గవర్నర్‌ చేసిన కామెంట్స్‌ విన్నానని.. ఇప్పుడు ఆయన అన్ని హద్దులూ దాటారని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ నిన్న మాత్రం శివాజీ మహారాజ్‌ను కీర్తిస్తూ మాట్లాడారని.. కాకపోతే ఆలస్యంగా గుర్తించారన్నారు.

గవర్నర్‌ కోశ్యారీ విషయంలో రాష్ట్రపతి, ప్రధాని ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులను కీలక పదవుల్లో కూర్చోబెట్టరాదన్నారు. గవర్నర్‌ పదవి ఒక సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందని.. ఆ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడేందుకు ఇంతకుముందు ఎప్పుడూ ఆయనకు వ్యతిరేకంగా తాము మాట్లాడలేదని ఈ సందర్భంగా పవార్‌ చెప్పారు. కానీ ఆయన ఇప్పుడు శివాజీపై వ్యాఖ్యలు చేయడం ద్వారా అన్ని హద్దులూ దాటారంటూ మండిపడ్డారు. మరోవైపు, రెండు రోజుల పర్యటనలో భాగంగా గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ గురువారం దిల్లీ పర్యటనకు వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని