Supreme Court: వారి భావ ప్రకటన స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించలేం : సుప్రీం

వాక్‌స్వాతంత్ర్యంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుల భావ ప్రకటనపై అధిక పరిమితులు విధించలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(2) కింద నిర్దేశించినవి మినహా.. వారి వాక్‌ స్వాతంత్ర్యంపై ఎటువంటి అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.

Published : 03 Jan 2023 14:46 IST

దిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుల భావ ప్రకటనపై అదనపు పరిమితులు విధించలేమని స్పష్టం చేసింది. సమష్టి బాధ్యత సూత్రం వర్తింపజేసినప్పటికీ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేమని తెలిపింది. ఇదే సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(2) కింద నిర్దేశించినవి మినహా.. వారి వాక్‌ స్వాతంత్ర్యంపై ఎటువంటి అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సామూహిక అత్యాచార కేసుపై అప్పట్లో ఆ రాష్ట్ర మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. 4:1 మెజారిటీతో ఈ విధమైన తీర్పు వెలువరించింది.

పౌరుల హక్కులకు విరుద్ధంగా మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని పేర్కొంటూ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. అయితే, నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేమని.. ఈ సమస్యకు పార్లమెంటు పరిష్కారం చూపాలని ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. నేతలు చేసే విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం, స్వేచ్ఛ, సమానత్వాన్ని దెబ్బతీస్తాయని.. సమాజంలో ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతో ముఖ్యమని జస్టిస్‌ నాగరత్న స్పష్టం చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ బులంద్‌షహర్‌ జిల్లాలో 2016 జులై నెలలో ఓ సామూహిక అత్యాచారం కేసు నమోదయ్యింది. తన భార్య, కుమార్తెపై జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన కేసును దిల్లీకి బదిలీ చేయాలంటూ యూపీకి చెందిన వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. అంతేకాకుండా ఈ ఘటనను ‘రాజకీయ కుట్రగా’ పేర్కొంటూ అప్పట్లో మంత్రిగా ఉన్న ఆజమ్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. అందుకు ఆయనపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. తొలుత దీనిని విచారించిన త్రిసభ్య ధర్మాసనం.. 2017 అక్టోబర్‌లో రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. నవంబర్‌ 15న ఈ కేసు విచారణ పూర్తిచేసిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం, జస్టిస్‌ నాగరత్నలతో కూడిన జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. తాజాగా తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని