Covid Symptoms: కరోనా కొత్త వేరియంట్‌లో కొత్త లక్షణాలు..!

కరోనా వైరస్‌ (Coronavirus) కొత్త వేరియంట్‌ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలను గుర్తించినట్లు పిల్లల వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు గత వైరస్‌ వేరియంట్ల వ్యాప్తి సమయంలో కనిపించలేదని తెలిపారు. 

Updated : 11 Apr 2023 15:16 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొత్త కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 (XBB.1.16) లేదా ఆర్ట్కురుస్‌ (Arcturus)గా పిలిచే కొత్త వేరియంట్‌ కారణమని వైద్యరంగ నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కొత్త వేరియంట్‌ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలను గుర్తించినట్లు పిల్లల వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు గత వేరియంట్ల వ్యాప్తి సమయంలో కనిపించలేదని తెలిపారు. ఈ వైరస్‌ చిన్నారులపై ప్రభావం చూపడం ఆందోళనకర విషయమని అంటున్నారు. అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితోపాటు కళ్లు పుసులు కట్టడం, దురదగా ఉండటం వంటి లక్షణాల గురించి ఫిర్యాదు చేస్తున్నట్లు పిల్లల వైద్య నిపుణులు వెల్లడించారు. గత వేరియంట్‌లలో కళ్ల పుసులు, దురద వంటి లక్షణాలు గుర్తించలేదని, ఇవి కొత్త వేరియంట్‌ లక్షణాలు కావచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ ఏడాది జనవరిలో ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌కు సంబంధించి రెండు కేసుల నమోదవ్వగా, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాటి సంఖ్య వందల్లోకి చేరినట్లు ఇండియన్‌ సార్స్‌కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం వెల్లడించింది. గత వేరియంట్‌లతో పోలిస్తే ఎక్స్‌బీబీ.1.16 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది వైద్యరంగ నిపుణులు హెచ్చరించారు. వారం రోజుల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతినిధి మరియా వాన్‌ ఖెర్ఖోవ్‌ (Maria Van KerKhove) మాట్లాడుతూ..‘‘ గత కొద్ది నెలలుగా కరోనా కొత్త సబ్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతోంది. అది ప్రమాదకరంగా కనిపించనప్పటికీ.. రూపాంతరం చెంది బలపడే అవకాశం ఉంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు. 

దేశంలో 1,78,533 మందికి కొవిడ్ (Covid 19) నిర్ధారణ పరీక్షలు చేయగా.. 6,050 మందికి వైరస్ సోకిందని కేంద్రం వెల్లడించింది. ముందురోజు కంటే 13 శాతం మేర పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్ 16 తర్వాత మొదటిసారి కేసులు ఐదు వేల మార్కు దాటాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ(Mansukh Mandaviya) శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని