NEET: నీట్‌ వ్యతిరేక బిల్లుపై స్పందించిన తమిళనాడు మంత్రి సుబ్రమణియన్‌

తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన నీట్‌ వ్యతిరేక బిల్లుకు గవర్నర్‌ ఆమోదం అవసరం లేదని, ఇప్పటికే అది రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లిపోయిందని ఆ రాష్ట్ర మంత్రి సుబ్రమణియన్‌ పేర్కొన్నారు.

Published : 13 Aug 2023 22:46 IST

చెన్నై: నీట్‌ వ్యతిరేక బిల్లు (Anti NEET)చట్ట రూపం దాల్చేందుకు ఇకపై గవర్నర్‌ రవి (Governor Ravi) ఆమోదం కోసం వేచి చూడనవసరం లేదని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ (Subramanian) అన్నారు. గతంలో ఈ బిల్లును గవర్నర్‌ తిరస్కరించడంతో.. ఇటీవల కొన్ని మార్పులు చేసి తిరిగి పంపించామని, ఈసారి వేరే మార్గం లేక ఆయన దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారని అన్నారు. అక్కడితో ఆయన పని అయిపోయిందని, నీట్‌ బిల్లుతో ఆయనకు సంబంధం లేదని చెప్పారు. బిల్లు ఆమోదానికి ఆయన సమ్మతి కూడా అవసరం లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత గవర్నర్‌కు కేవలం సమాచారం మాత్రమే వస్తుందన్నారు. శనివారం గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ తాజాగా ఓ ప్రకటనలో ఆయన ఈ విషయాలను పేర్కొన్నారు.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ పరిధి నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించాలంటూ అక్కడి ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య విద్య కోర్సుల్లో అవకాశాలు కల్పిస్తారు. 2021లోనే సీఎం ఎంకే స్టాలిన్‌ ఈ బిల్లును ప్రతిపాదించగా.. భాజపా మినహా అన్ని విపక్ష పార్టీలూ ఇందుకు ఆమోదం తెలిపాయి. భాజపా సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. కానీ, ఆ బిల్లును గవర్నర్‌ తిరస్కరించారు. దీంతో ఇటీవల ఆ బిల్లులో కొన్ని మార్పులు చేసిన తిరిగి పంపించగా ఆయన రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. 

ఇటీవల నీట్‌లో పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ నీట్‌ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపనని, ఒక వేళ ఇదే జరిగితే.. విద్యార్థులను  మేథో వికలాంగులుగా భావించాల్సిన పరిస్థితులు వస్తాయని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని