Viral video : వృద్ధుల సమయస్ఫూర్తి పసి ప్రాణాన్ని కాపాడింది!

విద్యుత్‌ షాక్‌ తగిలి బురద నీటిలో పడిపోయిన బాలుణ్ని ముగ్గురు వృద్ధులు రక్షించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా (Viral video) మారింది. 

Published : 27 Sep 2023 16:38 IST

Image : crocrimehq

ఇంటర్నెట్‌ డెస్క్ : అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్‌ తీగలు రహదారిపై నిలిచిన వర్షపు నీటిలో పడిపోయాయి. ఆ మడుగులో అడుగుపెట్టిన ఓ చిన్నారి షాక్‌కు గురయ్యాడు. ముగ్గురు వృద్ధులు చాకచక్యంగా వ్యవహరించి ఆ బాలుణ్ని రక్షించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రం వారణాసిలోని చేత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జితేంద్ర నివాసం ఉంటున్నాడు. మంగళవారం వారు ఉంటున్న వీధిలో భారీ వర్షం కురిసింది. కాస్త తెరిపివ్వగానే జితేంద్ర కుమారుడు కార్తీక్‌ ఆడుకోవడానికి బయటకు వచ్చాడు. ఆ క్రమంలో విద్యుత్‌ ప్రసరిస్తున్న స్తంభానికి సమీపంగా వెళ్లి ఒక్కసారిగా రోడ్డుపై నిలిచిన నీటిలో పడిపోయాడు. 

రోజువారీ పనులకూ డ్రోన్ల వినియోగం..!

ఆ సమయంలో అటుగా వస్తున్న ముగ్గురు వృద్ధులు బాలుడు పడిపోయిన విషయాన్ని గమనించారు. అందులో ఒకరు పరుగున వెళ్లి చిన్నారి పైకి లేపేందుకు యత్నించారు. అయితే, విద్యుత్‌ షాక్‌ ప్రసరిస్తున్నట్లు గ్రహించి వెనక్కి తగ్గారు. విషయం తెలిసి మిగిలిన ఇద్దరు వృద్ధులు వెంటనే ఓ కర్ర సేకరించి తీసుకొచ్చారు. అందులో ఒకరు దాన్ని నెమ్మదిగా బాలుడి చేతికి అందించారు. చిన్నారి దాన్ని పట్టుకోగానే అతడిని బురద నీటిలో నుంచి పక్కకు లాగారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. ఆ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది. వృద్ధుల సమయ స్ఫూర్తిని పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని