Budget 2024: ‘ఇదే ఆఖరు’.. బడ్జెట్‌పై విపక్షాల రియాక్షన్‌ ఇదే!

Opposition Reactions on budget: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ అంటూ దుమ్మెత్తిపోశాయి.

Published : 01 Feb 2024 19:48 IST

దిల్లీ: సార్వత్రిక సమరానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ‘అద్భుతాలేవీ ఉండకపోవచ్చు’ అంటూ ఆమె గతంలో పేర్కొన్నట్లే.. పెద్ద పెద్ద ప్రకటనలేవీ లేకుండానే ప్రసంగాన్ని ముగించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలపాలన్నదే తమ లక్ష్యమని ప్రసంగంలో పేర్కొన్నారు. ఎన్నికల అనంతరమూ తామే బడ్జెట్‌ను ప్రవేశపెడతామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అధికార భాజపా, ఎన్డీయే కూటమి పక్షాలు స్వాగతించాయి. ప్రభుత్వ ఆకాంక్షలకు ఈ బడ్జెట్‌ అద్దం పడుతోందని పేర్కొన్నాయి. విపక్షాలు మాత్రం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. ఆ పార్టీకిదే ఆఖరు బడ్జెట్‌ అని, అబద్ధాల పుట్ట అంటూ విమర్శలు గుప్పించాయి.

  • భాజపా ప్రభుత్వానికిదే ఆఖరి బడ్జెట్‌ అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. పదేళ్లుగా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బడ్జెట్‌లను ప్రవేశపెడుతోందని, ఆ రికార్డును ఇంకెవరూ తిరగరాయలేరని దుయ్యబట్టారు. ప్రజల అభివృద్ధి పట్టని బడ్జెట్‌ అర్థం లేనిదంటూ విమర్శించారు.
  • నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అపజయాలను విజయాలుగా పేర్కొనడం ఈ ప్రభుత్వం ప్రత్యేకత అంటూ ఎద్దేవా చేశారు. 45 శాతం యువత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే.. దాని గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వంలో జీడీపీలో ఎఫ్‌డీఐలు 3.6 శాతంగా ఉంటే.. ఇప్పుడు ఒక శాతం కూడా లేవని విమర్శించారు.
  • అద్దంలో వెనక్కి చూసుకుంటూ కారు నడుపుతున్నట్లు ఉందంటూ కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ బడ్జెట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ద్రవ్య లోటు రూ.18 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
  • మోదీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందంటూ ఉద్ధవ్‌ ఠాక్రే కామెంట్‌ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుండెను బరువు చేసుకుని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారంటూ విమర్శించారు. ప్రజల అంచనాలపై ఆర్థిక మంత్రి మరోసారి నీళ్లు చల్లారని ఉద్ధవ్‌ వర్గానికి చెందిన నేత ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.
  • ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించడానికే ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టారంటూ కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించలేదని దుయ్యబట్టారు.
  • మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు మరోసారి బడ్జెట్‌ వేదిక అయ్యిందని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ విమర్శించారు.
  • పదేళ్ల పాలనలో ఏమీ చేయనప్పటికీ.. తమను తాము పొగుడుకోవడానికి ఆర్థిక మంత్రి అధిక సమయమే తీసుకున్నారంటూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో ఏమీ చేయని దానికి శ్వేత పత్రం విడుదల చేయడం ఎందుకో? అని ప్రశ్నించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు