రోజూ 5 KMల నడక.. ఈ ఆహార పదార్థాలపై నిషేధం.. అమర్‌నాథ్‌ యాత్రికులకు సూచనలివే!

అమర్‌నాథ్‌ యాత్రకు వచ్చే యాత్రికులకు ఆలయ బోర్డు పలు ఆరోగ్య సూచనలు జారీ చేసింది. దీంతోపాటు యాత్రలో 40కిపైగా ఆహార పదార్థాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది.

Published : 16 Jun 2023 01:37 IST

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌ (Jammu Kashmir)లోని హిమాలయాల్లో అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రానికి జులై 1 నుంచి యాత్ర (Amarnath Yatra) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎత్తయిన మంచు కొండల్లో సాగే ఈ యాత్రకు వెళ్లేందుకు తగినంత శారీరక సన్నద్ధత, ఆరోగ్యం అవసరం. ఈ క్రమంలోనే యాత్రికులకు అమర్‌నాథ్‌ క్షేత్ర బోర్డు (SASB) కీలక ఆరోగ్య సలహాలు జారీ చేసింది. రోజూ కనీసం 5 కి.మీల నడకతో యాత్ర కోసం శారీరకంగా సన్నద్ధం కావాలని సూచించింది. యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలని తెలిపింది. దీంతోపాటు యాత్రలో 40కిపైగా ఆహార పదార్థాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది. శీతల పానీయాలు, వేపుడు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఈ జాబితాలో ఉన్నాయి.

దక్షిణ కశ్మీర్‌లోని మంచు పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. అనంతనాగ్ జిల్లాలోని సాంప్రదాయ 48 కి.మీల నున్వాన్- పహల్గాం మార్గంతోపాటు గందర్‌బాల్‌ జిల్లాలోని 14 కి.మీ నిటారైనన బాల్తాల్ మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ క్రమంలో యాత్రను ప్రారంభించే ముందు.. నిషేధిత ఆహార పదార్థాలను వెంట తీసుకురావద్దని, అనుమతించిన వస్తువుల జాబితాను సరిచూసుకోవాలని అధికారులు తెలిపారు. లేనిపక్షంలో జరిమానాలు తప్పవని హెచ్చరించారు. హైపోథర్మియా (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం) బారిన పడే ప్రమాదం ఉన్నందున.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నిషేధిత పదార్థాలివే..: మాంసాహారంతోపాటు ఫ్రైడ్ రైస్, పూరీ, పిజ్జా, బర్గర్, దోశె, వెన్నతో కూడిన బ్రెడ్, క్రీమ్ పదార్థాలు, ఊరగాయ, చట్నీ, వేయించిన పాపడ్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, శీతల పానీయాలు, హల్వా, జిలేబీ, గులాబ్‌ జామ్‌, సమోసా, చిప్స్‌ వంటివి ఉన్నాయి.

అనుమతి ఉన్నవి: తృణధాన్యాలు, పప్పులు, కూరగాయలు, సలాడ్‌లు, బంగాళాదుంపలు, చపాతీలు, ఇడ్లీ, బ్రెడ్‌ జాం, పండ్లు, మొలకలు, పాయసం, ఎండు ఫలాలు, నువ్వుల లడ్డూలు, వేడివేడి ద్రవపదార్థాలను బోర్డు సిఫార్సు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని