భాజపా ఎంపీలు సహా 100మంది ప్రయాణికులను వదిలేసిన పైలట్.. ఎందుకంటే..?

విమానం(Air India Flight) టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆ ప్రయాణికుల్లో పార్లమెంట్ సభ్యులు కూడా ఉండటం ఆందోళనకు దారితీసింది.

Updated : 25 Jul 2023 16:05 IST

రాజ్‌కోట్‌: దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) మరోసారి వార్తల్లో నిలిచింది. విమానం టేకాఫ్ చేసేందుకు పైలట్(Air India pilot) నిరాకరించడంతో వంద మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ విమానాశ్రయం (Rajkot airport in Gujarat ) నుంచి దిల్లీ(Delhi)కి బయలుదేరాల్సిన విమానంలో ఈ పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో ప్రయాణికుల్లో ముగ్గురు భాజపా ఎంపీ(BJP MP)లు కూడా ఉండటం గమనార్హం. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాత్రి 8.30 గంటల సమయంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం దిల్లీకి బయలుదేరాల్సి ఉంది. అయితే విమానం టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించారు. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం.. తన పనిగంటలకు మించి పనిచేయడంతో విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ ససేమిరా అన్నారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ వందమంది ప్రయాణికుల్లో రాజ్‌కోట్‌ ఎంపీ మోహన్‌ కుందరియా, జామ్‌నగర్ ఎంపీ పూనమ్ మాదమ్‌, రాజ్యసభ ఎంపీ కేసరీదేవ్‌ సిన్హ్‌ ఝాలా కూడా ఉన్నారు. దాంతో విమానాశ్రయంలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.

‘అభిమానులను కరీనా పట్టించుకోలేదు’: నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్య

వివరణ ఇచ్చిన ఎయిరిండియా..

ఈ ఘటనపై విమర్శలు వ్యక్తం కావడంతో ఎయిరిండియా(Air India) వివరణ ఇచ్చింది. ఆపరేషనల్‌ కారణాల వల్ల విమానం ఆలస్యమైందని తెలిపింది. ‘నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం.. డ్యూటీ సమయం పరిమితులను దాటి వారు తమ విధులను నిర్వహించడం వీలుకాదు. ఆ విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. అత్యవసరంగా గమ్యస్థానాలు చేరాల్సిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. మిగిలినవారికి హోటల్‌లో సదుపాయాలు కల్పించాం. ఎవరైనా టికెట్‌ రద్దు చేసుకుంటే.. పూర్తి సొమ్మును వాపసు చేసుకొనే వీలు కల్పించాం’ అని  ఎయిరిండియా తన ప్రకటనలో పేర్కొంది. 

గత నెల కూడా ఎయిరిండియా విమానంలో ఈ తరహా ఘటన జరిగింది. లండన్‌ నుంచి దిల్లీ బయలుదేరిన  విమానం.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాజస్థాన్‌లోని జైపుర్‌లో దిగింది. ఆ అత్యవసర ల్యాండింగ్ అనంతరం రెండు గంటల తర్వాత దిల్లీకి వెళ్లేందుకు దిల్లీ ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) క్లియరెన్స్‌ ఇచ్చింది. కానీ, పైలట్‌ (Pilot) మాత్రం విమానాన్ని టేకాఫ్‌ చేసేందుకు నిరాకరించాడు. డ్యూటీ సమయం పరిమితులు, పని గంటలను కారణంగా చూపి తాను విమానాన్ని నడపబోనని పట్టుబట్టాడు. దీంతో దాదాపు 350 మంది ప్రయాణికులు జైపుర్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని గమ్యస్థానాలకు చేరగా.. మరికొంతమంది విమానాశ్రయంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. చివరకు ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో కొన్ని గంటల తర్వాత విమానం తిరిగి దిల్లీ చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని