కాంగ్రెస్‌ ‘కాకరకాయ’ వంటిది.. ఏం చేసినా వారి తీరు మారదు - మోదీ

కాంగ్రెస్‌ను కాకరకాయతో పోల్చారు. నేతిలో వేయించినా, చక్కెర కలిపినా దారి రుచి మారనట్లే కాంగ్రెస్‌ వైఖరి కూడా మారదని ప్రధాని మోదీ విమర్శించారు.

Published : 08 Apr 2024 21:11 IST

చంద్రాపుర్‌: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్ష కాంగ్రెస్‌ను కాకరకాయతో పోల్చారు. నేతిలో వేయించినా, చక్కెర కలిపినా దాని రుచి మారనట్లే కాంగ్రెస్‌ వైఖరి కూడా మారదన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఆ పార్టీ కారణమని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించి మోదీ కాంగ్రెస్‌ తీరును మరోసారి ఎండగట్టారు.

‘దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ కాంగ్రెస్‌ మూలం. మత ప్రాతిపదికన దేశ విభజనకు ఎవరకు బాధ్యులు? రాముడి ఉనికిని ప్రశ్నించింది, రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించింది ఎవరు? ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిరస్కరించింది ఎవరు?’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. పదేళ్లుగా అధికారానికి కాంగ్రెస్‌ దూరంగా ఉందని, ఈ సమయంలో సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలో నక్సల్స్‌ బెడద తగ్గిందన్న ఆయన.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉగ్రవాదంపై ఆ పార్టీ చూసీచూడనట్లు వ్యవహరించిందని ఆరోపించారు. ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టో ముస్లిం లీగ్‌ మాదిరిగానే ఉందని మరోసారి విమర్శలు గుప్పించారు.

తాజా ఎన్నికలు స్థిరత్వానికి, అస్థిరత్వానికి మధ్య జరుగుతోన్న పోరు అని.. అవినీతిలో మునిగి తేలేందుకే విపక్ష పార్టీలు అధికారం కోసం చూస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత పదేళ్లుగా పేదల కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ కాకరకాయ వంటిదన్న మోదీ.. నెయ్యిలో వేయించినా, చక్కెర కలిపినా దాని రుచి మారనట్లే ఆ పార్టీ తీరు మారదని విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని