Manik Saha: ‘మన్‌ కీ బాత్‌’ చాలా పాపులర్‌ :మాణిక్ సాహా

1980ల్లో వచ్చిన రామాయణం, మహాభారతం టీవీ సీరియళ్ల కంటే ‘మన్‌ కీ బాత్‌’ (Mann Ki Baat) అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమమని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా వ్యాఖ్యానించారు.

Published : 31 Dec 2023 20:20 IST

అగర్తలా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’ (Mann Ki Baat)పై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1980ల్లో వచ్చిన రామాయణం, మహాభారతం టీవీ సీరియళ్ల కంటే ‘మన్‌ కీ బాత్‌’ అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమమని వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం బార్‌డోలీలో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని కార్యకర్తలు, స్థానికులతో కలిసి విన్న అనంతరం ఆయన ఈ విధంగా మాట్లాడారు.

‘కొన్ని దశాబ్దాల కింద దూరదర్శన్‌లో ప్రతి ఆదివారం వచ్చే మహాభారతం, రామాయణం ఎపిసోడ్లను చూసేందుకు మన తల్లులు, సోదరీమణులు టీవీలవైపు పరుగెత్తడం చూశాం. ఈ రోజుల్లో మాత్రం ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. 1980ల్లో వచ్చిన ఆ సీరియళ్ల కంటే ఈ కార్యక్రమం (Mann Ki Baat) అత్యంత ప్రజాదరణ పొందింది’ అని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా పేర్కొన్నారు. మహిళలు టీవీ చూడటానికి పరుగులు తీస్తే అప్పట్లో కొందరు విమర్శించారని, ఇప్పుడు కూడా ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమానికి వెళ్తున్న వారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ.. ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు.

మరోవైపు రామానంద సాగర్‌ నిర్మించిన రామాయణం 1987లో రాగా, బీఆర్‌ చోప్రా రూపొందించిన మహాభారతం 1988లో ప్రారంభమయ్యాయి. దూరదర్శన్‌లో వచ్చిన ఆ సీరియళ్లు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతినెల చివరి వారంలో దేశ ప్రజలనుద్దేశించే చేసే ‘మన్‌ కీ బాత్‌’ అక్టోబర్‌ 3, 2014లో మొదలు కాగా ఇప్పటివరకు 108 ఎపిసోడ్లు పూర్తయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని