Adani Group: అదానీ గ్రూప్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు

Adani Group: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల వివాదం ఇంకా పూర్తిగా సద్దుమణగనే లేదు. తాజాగా మరో సంస్థ ఈ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నివేదిక విడుదల చేసింది.

Published : 31 Aug 2023 11:08 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌పై తాజాగా మరో సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రమోటర్‌ కుటుంబంతో భాగస్వామ్యం ఉన్న పలువురు.. వందల మిలియన్ల డాలర్లు అదానీ గ్రూప్‌ (Adani Group) స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి లబ్ధి పొందారని ‘ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (OCCRP)’ ఆరోపించింది. మారిషస్‌ కేంద్రంగా పనిచేస్తున్న పలు ‘అజ్ఞాత’ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ల ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ (Adani Group) తీవ్రంగా ఖండించింది. అమెరికన్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) చేసిన ఆరోపణలనే ఓసీసీఆర్‌పీ మరోసారి తెరపైకి తెస్తోందని తెలిపింది.

తాజా ఆరోపణలు చేసిన ఓసీసీఆర్‌పీ (OCCRP)లో ప్రముఖ అంతర్జాతీయ మదుపరి జార్జ్‌ సోరోస్‌, రాక్‌ఫెల్లర్‌ బ్రదర్స్‌ ఫండ్‌ వంటి వారికి పెట్టుబడులు ఉన్నాయి. స్టాక్‌ ధరల్ని పెంచేందుకు అదానీ గ్రూప్‌ (Adani Group) అవకతవకలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలను గతంలో జార్జ్‌ సోరోస్‌ సమర్థించారు. వీటన్నింటిని అదానీ గ్రూప్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది.

ఆ ఇద్దరిపై అనుమానం..

పన్నులు తక్కువగా ఉండే పలు దేశాల్లోని పత్రాలు, అదానీ గ్రూప్‌ అంతర్గత ఇ-మెయిళ్లను తాము పరిశీలించినట్లు ఓసీసీఆర్‌పీ తెలిపింది. కనీసం రెండు కేసుల్లో ‘అనుమానాస్పద’ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్‌ షేర్లను విదేశీ ఫండ్ల ద్వారా క్రయవిక్రయాలు చేసినట్లు గుర్తించామని పేర్కొంది. నాసర్ అలీ షాబాన్ అహ్లీ, ఛాంగ్‌ చుంగ్‌-లింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులు అదానీ కుటుంబంతో దీర్ఘకాలంగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పింది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీకి చెందిన పలు కంపెనీల్లో వీరు డైరెక్టర్లుగా, వాటాదారులుగా కూడా వ్యవహరించినట్లు తెలిపింది. వీరు విదేశీ ఫండ్ల ద్వారా అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేసి విక్రయిస్తూ వస్తున్నారని వెల్లడించింది. ఫలితంగా గణనీయంగా లాభాలను ఆర్జించారని పేర్కొంది.

అదానీ కుటుంబ సమన్వయంతోనే..

అహ్లీ, చాంగ్‌ అదానీ గ్రూప్‌ ప్రమోటర్ల తరఫునే వ్యవహరిస్తున్నారని భావించాలా అని ఓసీసీఆర్‌పీ ప్రశ్నించింది. ఒకవేళ అదే నిజమైతే.. కంపెనీలో ఇన్‌సైడర్లే 75 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకున్నట్లు అవుతుందని తెలిపింది. ఇది భారత లిస్టింగ్‌ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అయితే, అహ్లీ, చాంగ్‌.. అదానీ ఫ్యామిలీ నుంచి తీసుకున్న డబ్బులను ఇన్వెస్ట్‌ చేశారనడానికి తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. కానీ, అదానీ స్టాక్స్‌లో వారి కుటుంబ సభ్యుల సమన్వయంతోనే ట్రేడింగ్‌ జరిగినట్లు తమ పరిశోధనలో ఆధారాలు లభించాయని పేర్కొంది. 2013 సెప్టెంబరులో 8 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ గ్రూప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌.. గత ఏడాదికి 260 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు గుర్తుచేసింది.

ఇది ఓ కుట్ర..

ఓసీసీఆర్‌పీ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. తాజా ఆరోపణల్లో పేర్కొన్న మారిషస్‌ ఫండ్స్‌ను హిండెన్‌బర్గ్‌ సైతం ఉటంకించిందని గుర్తుచేసింది. తాజా ఆరోపణలు కేవలం వాటి పునశ్చరణ మాత్రమేనని కొట్టిపారేసింది. వీటికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. నమోదిత అదానీ గ్రూప్‌ సంస్థలన్నీ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయని వివరించింది. ‘‘మేం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాం. ఈ వార్తలు యోగ్యత లేని హిండెన్‌బర్గ్ నివేదికను పునశ్చరిస్తున్నాయి. జార్జ్‌ సోరోస్‌ నిధులతో నడుస్తున్న కొన్ని ఫండ్‌లు విదేశీ మీడియాలోని ఒక విభాగం మద్దతుతో చేస్తున్న కుట్రగా ఇది కనిపిస్తోంది. నిజానికి దీన్ని మేం ముందే ఊహించాం. ఇప్పటికే వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇటువంటి నివేదికలు రావడం అనుమానాస్పదంగా ఉంది. ఏదేమైనా జరుగుతున్న న్యాయప్రక్రియను గౌరవించాల్సిన అవసరం ఉంది’’ అని అదానీ గ్రూప్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

అదానీ గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్లన్నీ ఈరోజు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10:24 గంటల సమయంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.46 శాతం నష్టపోయి రూ.2,426 దగ్గర ట్రేడవుతోంది. అత్యధికంగా అదానీ పవర్‌, అదానీ గ్రీన్‌ షేర్లు నాలుగు శాతం నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని