Russia Elections: రష్యా అధ్యక్ష ఎన్నికలకు.. కేరళలో పోలింగ్‌

Russia Presidential Elections: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కేరళలోనూ పోలింగ్‌ కొనసాగుతోంది. అదేంటీ.. ఆ ఎన్నికలు మన దేశంలో ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారా..? అదేంటో తెలుసుకోండి..!

Published : 15 Mar 2024 11:03 IST

తిరువనంతపురం: రష్యా అధ్యక్ష ఎన్నికలకు (Russia Presidential Elections) శుక్రవారం పోలింగ్‌ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే.. ఈ ఎన్నికల కోసం మన దేశంలోని కేరళ (Kerala)లో పోలింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఈ రాష్ట్రంలో నివసించే రష్యన్‌ పౌరులు ఇక్కడి నుంచే అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటు (Voting) వేసేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు.

తిరువనంతపురంలోని రష్యన్‌ హౌస్‌ (ఆనరరీ కాన్సులేట్‌ ఆఫ్‌ రష్యన్‌ ఫెడరేషన్‌)లో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ పౌరులు ఈ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని హౌస్‌ డైరెక్టర్‌ రతీశ్‌ నాయర్‌ తెలిపారు. ‘‘రష్యా అధ్యక్ష ఎన్నికలకు కాన్సులేట్‌లో పోలింగ్‌ నిర్వహించడం ఇది మూడోసారి. ఇక్కడ స్థిరపడిన రష్యన్‌ పౌరులు, పర్యటకుల కోసం దీన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడి నుంచే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పౌరులు ఉత్సాహం చూపిస్తుండటం ఆనందంగా ఉంది’’ అని ఆయన వెల్లడించారు.

అత్యధిక ఎలక్టోరల్‌ బాండ్లు కొన్న ఆ లాటరీ కింగ్‌ ఎవరు..!

మార్చి 17 వరకు రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin)కు ప్రత్యర్థులుగా కేవలం ముగ్గురు అభ్యర్థులనే అక్కడి కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనుమతించింది. లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన లియోనిడ్‌ స్లట్‌స్కీ, న్యూ పీపుల్‌ పార్టీ వ్లాదిస్లవ్‌ డవాంకోవ్‌, కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన నికోలోయ్‌ ఖరితోనోవ్‌ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురూ క్రెమ్లిన్‌ అనుకూలురే అని తెలుస్తోంది.

వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో కొనసాగుతున్నారు. సోవియట్‌ పాలకుడు జోసెఫ్‌ స్టాలిన్‌ కన్నా ఎక్కువకాలం పాటు పదవిలో ఉన్న వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుత ఆరేళ్ల పదవీకాలం ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కువ సార్లు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా రాజ్యంగ సవరణ చేసి మరీ.. పుతిన్‌ మూడోసారి పోటీ పడుతున్నారు. ఈసారీ ఆయన విజయం ఖాయంగానే కన్పిస్తోంది. దీంతో 2030 వరకు ఆయన పదవిలో ఉండనున్నారు. ఆ తర్వాత మరో ఆరేళ్ల కాలానికీ పుతిన్‌ పోటీ చేసే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని