Covid: ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే

కొవిడ్‌-19 మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బుధవారం సుప్రీం కోర్టు తీర్చునిచ్చింది.

Updated : 30 Jun 2021 12:10 IST

సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: కొవిడ్‌-19 మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బుధవారం సుప్రీం కోర్టు తీర్చునిచ్చింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి ఆరు వారాల గడువు విధించింది. ఎంత మొత్తం అందించాలనే నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వానికే వదిలేసింది. కొవిడ్ కారణంగా మరణించిన ప్రతిఒక్కరికి రూ.4లక్షలు చెల్లించలేమని కొద్ది రోజుల క్రితం కేంద్రం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. కొవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది.

ఈ క్రమంలో ప్రభుత్వం వినిపించిన వాదనలను పరిశీలించిన సుప్రీం.. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించే నిమిత్తం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్‌డీఎంఏ)ని కనీస ప్రమాణాలు రూపొందించాలని ఆదేశించింది. తద్వారా కొంత మొత్తం చెల్లించవచ్చని చెప్పింది. కనీస ప్రమాణాలను సూచించడంలో ఎన్‌డీఎంఏ విఫలమైందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే పరిహార నియమాలు, పరిహారం మొత్తాన్ని నిర్ణయించడం తమ పరిధిలో లేదని పేర్కొంటూ.. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది.

అలాగే కొవిడ్ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా వెంటనే జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ధ్రువీకరణ పత్రాల్లో మరణించిన తేదీ, కారణం ఉండాలని పేర్కొంది.

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా 3.98లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. అంతమందికి పరిహారం ఇవ్వాల్సి వస్తే విపత్తు నిర్వహణ నిధులన్నీ వాటికే కేటాయించాల్సి వస్తుందని కేంద్రం కొద్ది రోజుల క్రితం కోర్టుకు వెల్లడించింది. దాంతో కరోనా విజృంభణ సమయంలో అత్యవసర వైద్యసేవలు, పరికరాలను సమకూర్చుకోవడం, తుపానులు, వరదలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాల వద్ద సరిపడా నిధులుండవని వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని