Menstrual hygiene: ‘నెలసరి శుభ్రత’పై పాలసీ ఆలస్యం.. రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్‌

పాఠశాలల్లో చదివే బాలికలు రుతుక్రమ పరిశుభ్రతను పాటించేలా జాతీయ విధానాన్ని రూపొందించడం కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆగస్టు 31లోగా తమ స్పందనలను కేంద్రానికి సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 24 Jul 2023 17:29 IST

దిల్లీ: పాఠశాలల్లో చదువుతున్న బాలికల రుతుక్రమ పరిశుభ్రత (Menstrual hygiene)పై జాతీయ విధానాన్ని (National Policy) రూపొందించడంలో రాష్ట్రాలు అలసత్వం ప్రదర్శించడంపై సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. ఆగస్టు 31లోగా ఈ అంశంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ స్పందనలను కేంద్రానికి సమర్పించాలని ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 6-12 తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌ (Sanitary Pads)లు అందించాలని, పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలో విచారణ చేపట్టింది. పాఠశాలల్లో చదివే బాలికలు రుతుక్రమ పరిశుభ్రతను పాటించేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఓ జాతీయ విధానాన్ని అవలంబించాలని సూచించింది. ఈ విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు, సలహాలు-సూచనలను సేకరించాలని ఈ ఏడాది ఏప్రిల్‌ 10న కేంద్రాన్ని ఆదేశించింది.

ఇద్దరు మిత్రుల ‘నెలసరి’ పరిష్కారం!

ఈ పిటిషన్‌పై సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ‘‘రుతుక్రమ పరిశుభ్రత (Menstrual hygiene)పై జాతీయ విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా తమ స్పందనలను కేంద్రానికి ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు కేవలం హరియాణా, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి మాత్రమే తమ అభిప్రాయాలను సమర్పించాయి’’ అని భాటి కోర్టుకు వివరించారు. మిగతా రాష్ట్రాలు కూడా తమ స్పందనలు తెలియజేసేందుకు మరో చివరి అవకాశం ఇవ్వాలని కోరారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆగస్టు 31వ తేదీలోగా తమ అభిప్రాయాలను కేంద్రానికి సమర్పించాలని ఆదేశించింది. లేదంటే ఆయా రాష్ట్రాలు, యూటీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఉత్తర్వుల కాపీని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సూచించింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబరు రెండో వారానికి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని