TruCup: ఇద్దరు మిత్రుల ‘నెలసరి’ పరిష్కారం!

నెలసరి విషయంలోనే కాదు.. ఈ సమయంలో ఉపయోగించే నెలసరి ఉత్పత్తుల పైనా చాలామందిలో అపోహలు, సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తెలిసి కొందరు, తెలియకుండా మరికొందరు చేసే పొరపాట్లు వారిలో పలు అనారోగ్యాలకు, అసౌకర్యానికి దారి....

Updated : 24 Jul 2023 13:24 IST

(Photos: Instagram)

నెలసరి విషయంలోనే కాదు.. ఈ సమయంలో ఉపయోగించే నెలసరి ఉత్పత్తుల పైనా చాలామందిలో అపోహలు, సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తెలిసి కొందరు, తెలియకుండా మరికొందరు చేసే పొరపాట్లు వారిలో పలు అనారోగ్యాలకు, అసౌకర్యానికి దారి తీస్తుంటాయి. ఈ పొరపాట్లను సరిదిద్దుతూ, అపోహల్ని మొగ్గలోనే తుంచేస్తూ.. ఎంతోమంది అమ్మాయిలు/మహిళలు సౌకర్యవంతంగా పిరియడ్స్‌ని ఆస్వాదించేలా చేస్తున్నారు ఇద్దరు స్నేహితులు. తమ స్వీయానుభవాలతో, క్షేత్రస్థాయిలో పలువురు ఎదుర్కొనే సమస్యల్ని పరిగణనలోకి తీసుకొని.. అందుకు పరిష్కారంగా మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ని రూపొందిస్తున్నారీ ఇద్దరు మిత్రులు. అంతేనా.. దాన్ని అందరూ ఉపయోగించేలా అవగాహన కూడా కల్పిస్తున్నారు. మరి, ఇంతకీ ఎవరీ ఫ్రెండ్స్‌? మెన్‌స్ట్రువల్‌ కప్‌ తయారుచేయాలన్న ఆలోచన వారికి ఎలా వచ్చింది? తెలుసుకుందాం రండి..

సిమ్లాకు చెందిన అలక్షీ తోమర్‌, రాజస్థాన్‌కు చెందిన శివాంగి బగ్రీ.. వీరిద్దరూ స్కూల్‌ ఫ్రెండ్స్‌. పదో తరగతి వరకు కలిసి చదువుకున్న వీరు.. పైచదువుల కోసం వేర్వేరు విద్యాసంస్థల్లో చేరినా.. ఫోన్లో టచ్‌లో ఉండేవాళ్లు. వీలు చిక్కినప్పుడల్లా కలుసుకునే వాళ్లు. తమ ప్రతిభ, నైపుణ్యాలు సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని లక్ష్యంగా పెట్టుకున్నారీ స్నేహితులు.

మురికివాడల్లోని దుస్థితి చూశాక..!

అలక్షి జెంషెడ్‌పూర్‌లోని XLRIలో ‘హ్యూమన్ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌’ విభాగంలో పీజీ పూర్తిచేశాక.. పలు ఐటీ సంస్థల్లో పని చేసింది. మరోవైపు శివాంగి ‘డిజైన్‌-బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్’ చదివింది. ఆపై పలు అంతర్జాతీయ పత్రికలకు ఎడిటర్‌గా పనిచేసింది. అంతేకాదు.. యోగా టీచర్‌గానూ రాణిస్తోంది. అయితే ఒకానొక సమయంలో ముంబయి మురికివాడల్లోని అమ్మాయిలు/మహిళలు నెలసరి సమయంలో ఎదుర్కొంటున్న దుస్థితిని గమనించారీ ఇద్దరు స్నేహితురాళ్లు.

‘అప్పటివరకు నెలసరి గురించిన అపోహలు, మూఢనమ్మకాల గురించి వినడమే కానీ.. ముంబయి మురికివాడల్లో ప్రత్యక్షంగా చూశాం. పిరియడ్స్‌ సమయంలో స్నానం చేయకూడదని, నెలసరి రక్తస్రావం అపవిత్రమైందని అక్కడి వారు అమ్మాయిల్ని దూరం పెట్టడం గమనించాం. ఇక ఈ సమయంలో వివిధ కారణాల వల్ల స్కూల్‌ మానేసే అమ్మాయిలూ పెరుగుతున్నట్లు గుర్తించాం.. అంతేకాదు.. బాల్యవివాహాలు, చిన్న వయసులోనే గర్భం ధరించడం.. వంటివీ అక్కడ ఎక్కువే! ఇవన్నీ వారి ఆరోగ్యంపై, మానసిక ప్రశాంతతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.. అందుకే ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనుకున్నాం..’ అంటున్నారు శివాంగి-అలక్షి.

అందుకే ‘కప్‌’ను ఎంచుకున్నాం!

ఈ క్రమంలో- నెలసరి పరిశుభ్రత, ఈ సమయంలో ఉపయోగించే ఉత్పత్తులపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్న ఈ ఇద్దరు స్నేహితులు.. ఎకో-ఫ్రెండ్లీ శ్యానిటరీ ఉత్పత్తుల్ని వారికి చేరువ చేయాలనుకున్నారు.

‘సహజసిద్ధమైన పద్ధతుల్లో శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేయాలనుకున్నాం. కానీ వీటి కంటే మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ మరింత సౌకర్యాన్ని అందించడంతో పాటు ఆరోగ్యకరమైనవి అని మేం వీటిని వాడాకే అర్థమైంది. అలాగే వీటిని తిరిగి ఉపయోగించడం వల్ల పర్యావరణానికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా వీటిని ఉపయోగించే వారూ తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నాం. ఈ సంఖ్యను పెంచడంలో భాగంగానే కప్స్‌ వైపు మొగ్గు చూపాం. ఈ ఆలోచనతోనే 2018లో ‘ట్రూ కప్‌’ సంస్థను ప్రారంభించాం. శ్యానిటరీ ప్యాడ్స్‌లో మాదిరిగా కప్స్‌ తయారీలో పరిమళాలు, రసాయనాలు.. వంటివేవీ ఉండవు.. పూర్తిగా సిలికాన్‌తోనే వీటిని తయారుచేస్తారు.. కాబట్టి ఇవి పర్యావరణహితమైనవి.. అలాగే వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు, అలర్జీల భయమూ ఉండదు..’ అని చెబుతున్నారీ ఇద్దరు ఫ్రెండ్స్.

వాళ్ల ఆలోచనల్ని మార్చుతూ..!

స్వయంగా డిజైనింగ్‌ నైపుణ్యాలున్న శివాంగి.. ముందు కొన్ని శాంపిల్‌ కప్స్‌ని తయారుచేసింది. ఆపై వీటిని ఈ ఇద్దరు ఫ్రెండ్స్‌ ప్రయత్నించి సౌకర్యంగా ఉన్నాయనుకున్న తర్వాతే తమ తోటి స్నేహితులకు అందించారు. వాళ్ల నుంచి స్పందన సానుకూలంగా రావడంతో.. అదే ఏడాది వెబ్‌సైట్‌ను ప్రారంభించిందీ ఫ్రెండ్స్‌ ద్వయం.

‘ప్యాడ్స్‌ మాదిరిగా వీటిని పదే పదే మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల పర్యావరణానికీ మేలు జరుగుతుంది. ఇక మేం తయారుచేసిన కప్స్‌ బ్లీడింగ్‌ని బట్టి 8-10 గంటల వరకు రక్షణనిస్తాయి. పదేళ్ల పాటు మన్నుతాయి. వెజైనా పరిమాణం, బ్లీడింగ్‌ని బట్టి మా వద్ద వివిధ రకాల కప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇన్ని ప్రయోజనాలున్నా.. వీటిని ఉపయోగించడానికి చాలామంది ఆసక్తి చూపట్లేదు. ఇందుకు వారిలో ఉన్న సందేహాలు, అపోహలే కారణం. కొంతమంది వీటిని అమర్చుకోవడం వల్ల వెజైనా వదులవుతుందని, మరికొందరు వీటిని ఉపయోగిస్తే సౌకర్యంగా ఉండదని, వీటి వల్ల కన్నె పొర దెబ్బతింటుందని.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన అపోహ నెలకొంది. వీటిని తొలగించేందుకు స్కూల్స్‌, కాలేజీలు, కార్పొరేట్‌ సంస్థలు, కమ్యూనిటీల్లో, గ్రామాల్లో.. ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం..’ అని చెబుతున్నారు.

ప్రస్తుతం తమ వెబ్‌సైట్‌తో పాటు పలు ఈ-కామర్స్ వేదికలు, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌, మందుల దుకాణాల్లో తమ ఉత్పత్తిని అందుబాటులో ఉంచిన ఈ ఇద్దరు మిత్రులు.. సింగపూర్‌, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లోనూ ట్రూ కప్‌ను విక్రయిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు తమ వ్యాపారాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న వీరు.. నెలసరిపై అపోహలు ఎక్కువగా ఉన్న దేశాల్లో దీనిపై మరింత అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్