Covishield Booster: బూస్టర్‌ వ్యవధిని 6నెలలకు తగ్గించండి : పూనావాలా

బూస్టర్‌ డోసు వ్యవధిని తొమ్మిది నుంచి 6 నెలలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

Updated : 10 Aug 2022 12:14 IST

కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ

దిల్లీ: కొవిడ్‌ పోరులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రికాషనరీ డోసు పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటిని ప్రైవేటులో కేంద్రాల్లోనే అందిస్తుండగా.. రెండో డోసు తీసుకున్న 9 నెలల గడువు పూర్తయిన వారికే పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోసు వ్యవధిని తొమ్మిది నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. తద్వారా వీలైనంత త్వరగా ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించవచ్చని సూచించారు.

‘ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. ఎందుకంటే రెండు, మూడు డోసుల మధ్య గడువు 9 నెలలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వీటి మధ్య వ్యవధి 6 నెలలుగా ఉన్నందున భారత్‌ కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాను’ అని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ పేర్కొన్నారు. తద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి బూస్టర్‌ డోసును అందించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక ప్రైవేటులో అందిస్తోన్న కొవిషీల్డ్‌ ప్రికాషన్‌ డోసు ధర రూ.600 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని అదర్‌ పూనావాలా వెల్లడించారు. మరోవైపు కొవాగ్జిన్‌ ప్రికాషన్‌ డోసును రూ.225కే అందిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ప్రికాషనరీ డోసు పంపిణీ ఏప్రిల్‌ 10 నుంచి ప్రారంభమైంది. తొలి రోజు దాదాపు 10వేల డోసులను పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 18ఏళ్లకు పైబడిన వారికి ప్రైవేటులో మాత్రమే ప్రికాషన్‌ డోసును అందిస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 185.74కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని