Tara Shahdeo: షూటర్‌ తారా సహదేవ్‌ కేసులో.. మాజీ భర్తకు జీవిత ఖైదు

Shooter Tara Shahdeo: జాతీయ స్థాయి షూటర్‌ తారా సహదేవ్‌ బలవంతపు మతమార్పిడి కేసులో ఆమె మాజీ భర్తకు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించింది.

Published : 05 Oct 2023 17:31 IST

రాంచీ: జాతీయ స్థాయి అథ్లెట్‌, షూటర్‌ తారా సహదేవ్‌ (Shooter Tara Shahdeo) బలవంతపు మతమార్పిడి (Forced Conversion)కి సంబంధించిన కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు (CBI Court) గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆమె మాజీ భర్తతో పాటు మరో ఇద్దర్ని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారికి తాజాగా శిక్ష ఖరారు చేసింది. ఆమె మాజీ భర్త రకీబ్‌ఉల్‌ హసన్‌ అలియాస్‌ రంజిత్ కోహ్లీకి జీవిత ఖైదు (Life Imprisonment) విధించింది. హసన్‌ తల్లి కౌసర్‌ రాణికి 10 ఏళ్లు, మరో నిందితుడు ముస్తాఖ్‌ అహ్మద్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

ఏంటీ కేసు..?

ఝార్ఖండ్‌కు చెందిన తారా సహదేవ్‌ జాతీయ స్థాయి షూటర్‌గా రాణిస్తోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం రంజిత్‌ కోహ్లీ అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారి.. 2014 జులైలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే తారాకు సంచలన విషయాలు తెలిశాయి. తన భర్త అసలు పేరు రకీబ్‌ఉల్‌ హసన్‌ అని తెలిసింది. అదే సమయంలో తారా మతం మార్చుకోవాలని రకీబ్‌ఉల్‌ ఆమెపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆమె 2014 ఆగస్టులో తన భర్త, అత్తపై కేసు పెట్టింది.

మనీశ్‌ సిసోదియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలెక్కడ..?: దర్యాప్తు సంస్థలకు సుప్రీం ప్రశ్న

రకీబ్‌ఉల్‌ తనను మోసం చేసి వివాహం చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మతం మార్చుకునేందుకు అంగీకరించకపోవడంతో తనను శారీరకంగా హింసించారని ఆరోపించింది. ఝార్ఖండ్‌ హైకోర్టులో అప్పటి విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌గా ఉన్న ముస్తాఖ్‌ అహ్మద్‌.. తన అత్తింటి వారికి సహకరించాడని తారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఝార్ఖండ్‌ హైకోర్టు.. 2015లో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.

దీంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో రకీబ్‌ఉల్‌ హసన్‌, అతడి తల్లి కౌసర్‌ రాణి, మరో నిందితుడు ముస్తాఖ్‌ అహ్మద్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు గతవారం దోషులుగా తేల్చింది. తాజాగా వీరికి శిక్ష ఖరారు చేసింది. ఇదిలా ఉండగా.. 2018లో రాంచీలోని ఫ్యామిలీ కోర్టు తారాకు విడాకులు మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని