AN 94 Rifle: రష్యా ఆయుధం పంజాబ్‌కు ఎలా వచ్చింది..?

ప్రముఖ గాయకుడు సిద్ధూమూసేవాల హత్య ఇప్పుడు పంజాబ్‌లో గుబులు పుట్టిస్తోంది. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి కారులో బయటకు వచ్చిన మూసేవాలాపై ప్రత్యర్థులు తూటాల వర్షం కురిపించారు. క్షణాల వ్యవధిలో దాదాపు 30 తూటాలు పేల్చారు.

Updated : 01 Jun 2022 13:43 IST

 సిద్ధూ మూసేవాల హత్యలో గుబులు పుట్టిస్తోన్న రైఫిల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రముఖ గాయకుడు సిద్ధూమూసేవాల హత్య ఇప్పుడు పంజాబ్‌లో గుబులు పుట్టిస్తోంది. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి కారులో బయటకు వచ్చిన మూసేవాలాపై ప్రత్యర్థులు తూటాల వర్షం కురిపించారు. క్షణాల వ్యవధిలో దాదాపు 30 తూటాలు పేల్చారు. ఘటనా స్థలంలో లభించిన తూటాలు పరిశీలించాక షాకింగ్‌ విషయాలు వెల్లడవుతున్నాయి. తొలుత ఈ హత్యకు ఏకే-47 రైఫిల్‌ వాడినట్లు భావించారు. కానీ, అక్కడ దొరికిన ఖాళీ తూటాలను పరిశీలించి.. రష్యాకు చెందిన ఏఎన్‌-94 రైపిల్‌ను వాడినట్లు తేల్చారు. పంజాబ్‌లో ఈ రైఫిల్‌ లభించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ రష్యా రైఫిల్‌ను భారత్‌లో వినియోగించరు. దీనిని కేవలం రష్యా సాయుధ బలగాలు మాత్రమే వినియోగిస్తాయి. ఐరిష్‌ రిపబ్లిక్‌ ఆర్మీ అనే వేర్పాటువాద దళం వద్ద కూడా ఇవి ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్‌లో ఈ రైఫిల్‌ ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది.

హంతకులు తొలుత సిద్ధూ మూసేవాలా ఇంటి సమీపంలోకి వెళ్లగా.. అక్కడ ఏకే-47 రైఫిల్స్‌తో గార్డులు కనిపించారు. దీంతో వారు కెనడాలోని గోల్డీబ్రార్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ సాయంతో ఏఎన్‌-94 రైఫిల్‌ను సంపాదించి హత్యకు పాల్పడినట్లుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.

ఏమిటీ ఏఎన్‌-94 రైఫిల్‌..?

ఏఎన్‌-94 రష్యాలో తయారయ్యే రైఫిల్‌.  ఏఎన్‌ అంటే అవోటోమాట్‌ నికొనోవ్‌ అని అర్థం. ఈ రైఫిల్‌కు చీఫ్‌ డిజైనర్‌ గెన్నాడి నికొనోవ్‌ పేరు వచ్చేలా పెట్టారు. నికనోవ్‌ మెషిన్‌గన్‌ను కూడా డిజైన్‌ చేసింది ఆయనే. ఏఎన్‌-94 డిజైన్‌పై 1980లో పనిచేయడం మొదలుపెట్టి.. 1994లో పూర్తి చేశారు. ఆయన పేరిట పలు పేటెంట్లు ఉన్నాయి.

* రష్యాలో ఏకే-74 రైఫిల్‌ను భర్తీ చేసేందుకు ఏఎన్‌-94ను అభివృద్ధి చేశారు. కానీ, ఖరీదు ఎక్కువగా ఉండటం, సంక్లిష్టమైన డిజైన్‌ కావడంతో పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రష్యా సైన్యం కొన్ని అవసరాల కోసం ఏఎన్‌-94ను వాడుతోంది.

* ఈ రైఫిల్‌ టూరౌండ్‌ బరస్ట్‌ మోడ్‌లో నిమిషానికి 600 రౌండ్లను పేల్చగలదు. అదే ఆటోమేటిక్‌ మోడ్‌లో నిమిషానికి 1,800 తూటాలు దూసుకొస్తాయి.  దీని తూటా సెకన్‌కు 900 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 700 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అదే ఏకే-47 తూటా సెకన్‌కు 715 మీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఈ రైఫిల్‌కు జీపీ-30 గ్రనేడ్‌ లాంఛర్‌ను కూడా అమర్చవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని