Taiwan: తైవాన్‌ మీదకు పాతిక చైనా విమానాలు..!

తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికే ఉండవంటారు.. ! మన పొరుగు దేశమైన చైనా తీరు ఇలానే ఉంది. నిత్యం ఏదో ఒక దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకోకపోతే ఆ దేశ సైన్యానికి పొద్దుపోదు అన్నట్లుంది.

Updated : 16 Jun 2021 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికే ఉండవంటారు.. ! మన పొరుగు దేశమైన చైనా తీరు ఇలానే ఉంది. నిత్యం ఏదో ఒక దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకోకపోతే ఆ దేశ సైన్యానికి పొద్దుపోదు అన్నట్లుంది. ఓ పక్క భారత్‌తో ఏడాదిగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్‌తో గొడవ పెట్టుకొంది.. ఈ నెల మొదట్లో ఇండోనేషియా గగనతలంలోకి చొరబడింది.. గత వారం ఇండోనేషియా జలాల్లోకి చైనా సర్వే నౌక వెళ్లింది. నేడు తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌లోకి చైనా విమానాల దండు వెళ్లింది. ఏదో యుద్ధానికి బయల్దేరినట్లు పాతిక విమానాలు ఈ జోన్‌లోకి చొరబడ్డాయి. అణ్వాయుధాలను ప్రయోగించే నాలుగు హెచ్‌-6 బాంబర్లు, 14 జె-16,ఆరు జె-11 ఫైటర్‌ జెట్‌లు, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌కు వినియోగించే ఎర్లీవార్నింగ్‌ యుద్ధవిమానాలు ఉన్నాయి. ఈ విమానాల దండు తైవాన్‌ ఆధీనంలోని ప్రథాస్‌ ద్వీపాల  సమీపంలో ప్రయాణించాయి. 

ఈ ఏడాది చైనా విమానాలు తరచూ తైవాన్‌, ప్రథాస్‌ ద్వీపాల సమీపానికి వెళుతున్నాయి. జనవరి 24న 15 విమానాల దండు, ఏప్రిల్‌ 12 మరో 25 విమానాల దండు తైవాన్‌ సమీపం నుంచి వెళ్లాయి. తైవాన్‌ను ఆక్రమించుకోవాలని గత కొన్నేళ్లుగా చైనా తీవ్రంగాప్రయత్నిస్తోంది. 

సోమవారం నాటి ప్రకటనతో నాటో వైఖరిలో మార్పు వచ్చిన విషయం స్పష్టమైంది.  బ్రసెల్స్‌లోని  ప్రధాన కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సహ 30 దేశాధినేతలు సమావేశమై  చైనా ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. సైనికపరంగా ఆ దేశంతో ప్రపంచ భద్రతకే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ముఖ్యంగా అణుక్షిపణుల తయారీలో ఆ దేశం కనబరుస్తున్న వేగంపై నాటో కూటమి చర్చించింది. చైనా బాధ్యతగా వ్యవహరించాలని, అంతర్జాతీయ నియమాలను గౌరవించాలని తీర్మానంలో పేర్కొంది. నాటో తీర్మానంలో చైనా పేరును ప్రస్తావించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ విలేకరులతో మాట్లాడుతూ చైనాతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి నాటో కూటమి సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. బాల్టిక్స్‌ నుంచి ఆఫ్రికా వరకు ఎక్కడ చూసినా చైనాయే కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే చైనా యుద్ధవిమానాలు తైవాన్‌ వైపు వెళ్లడం గమనార్హం. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని