సాంకేతికతతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌: మోదీ

PM modi on Technology: భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు సాంకేతికత ఉపయోగపడనుందని మోదీ అన్నారు. దీని ద్వారా పేదలకు ప్రయోజనాలు అందుతున్నాయని చెప్పారు.

Published : 28 Feb 2023 13:36 IST

దిల్లీ: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (Developed nation) భారత్‌ అవతరించేందుకు సాంకేతికత సాయపడనుందని ప్రధాని మోదీ (PM modi) అన్నారు. డిజిటల్‌ విప్లవం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు డిజిటల్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ అనంతరం ‘సాంకేతికతతో జీవనం’ అనే అంశంపై నిర్వహించిన ఓ వెబినార్‌లో ఆయన మాట్లాడారు.

చిన్న వ్యాపారులకు భారంగా ఉన్న నిబంధనలను తగ్గించాలని తాము కోరుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఈ తరహావి 40 వేల నిబంధనలను తొలగించామన్నారు. తమకు అడ్డుగా భావిస్తున్న నిబంధనలతో జాబితాను రూపొందించాలని చిన్న వ్యాపారులకు సూచించారు. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యను అధిగమించేందుకు ఫేస్‌లెస్‌ టెక్నాలజీని తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత పౌరుల జీవితాల్లో సమూల మార్పులకు సాంకేతికత ఉపయోగపడుతోందన్నారు.

విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో 5జీ, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలు మార్పులు తీసుకొస్తున్నాయని మోదీ అన్నారు. టెక్నాలజీ వల్లే ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌’ కార్యక్రమం సాకరమైందని చెప్పారు. జన్‌ధన్‌ యోజన, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌తో పేద ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. ఈ శతాబ్దం టెక్నాలజీతో ముడిపడి ఉందని, దీన్నెవరూ ఆపలేరని మోదీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని