Crimes Against Women: రోజుకు 77 అత్యాచారాలు..!

దేశంలో మహిళలపై నేరాల పరంపర కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా నిత్యం సరాసరి 77 అత్యాచార కేసులు నమోదవుతున్నట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) నివేదిక వెల్లడించింది.

Published : 15 Sep 2021 22:02 IST

రాజస్థాన్‌లో అత్యధికం - ఎన్‌సీఆర్‌బీ నివేదిక

దిల్లీ: దేశంలో మహిళలపై నేరాల పరంపర కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా నిత్యం సరాసరి 77 అత్యాచార కేసులు నమోదవుతున్నట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) నివేదిక వెల్లడించింది. ఇలా ఏడాదిలో మొత్తం 28,046 సంఘటనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే, మహిళలపై జరుగుతోన్న నేరాలు క్రితం ఏడాది (2019)తో పోలిస్తే కాస్త తగ్గినట్లు ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. మహిళలపై నేరాలు విభాగంలో 2020 సంవత్సరంలో మొత్తం 3,71,503 కేసులు నమోదుకాగా.. అంతకు ముందు ఏడాది (2019)లో ఈ సంఖ్య 4,05,325 గా ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది.

ఏడాదికి 30వేల కేసులు..

దేశంలో 2020 సంవత్సరంలో కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా చాలావరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగాయి. అయినప్పటికీ అత్యాచార కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకర విషయంగానే చెప్పవచ్చు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం, 2020లో మొత్తం 28,046 అత్యాచార సంఘటనలు చోటుచేసుకోగా 28,153 మంది బాధితులుగా మారారు. వీరిలో 25,498 మంది 18ఏళ్లకు పైబడిన వారు కాగా 2655 మంది మైనర్లే కావడం విచారించదగ్గ విషయం. అంతకుముందు సంవత్సరాల్లో అనగా 2019లో 32,033 కేసులు, 2018లో 33,356 కేసులు, 2017లో 35,559 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇక 2016లో అత్యధికంగా దేశవ్యాప్తంగా 38,947 అత్యాచార కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది.

రాజస్థాన్‌లోనే అత్యధికం..

2020లో దేశంలో నమోదైన మొత్తం అత్యాచార కేసుల్లో అత్యధికంగా రాజస్థాన్‌ (5310)లోనే ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్‌ (2769), మధ్యప్రదేశ్‌ (2339), మహారాష్ట్ర (2061), అస్సాం (1657) రాష్ట్రాల్లో అధికంగా చోటుచేసుకున్నాయి. ఇక దేశ రాజధాని దిల్లీలో 997  అత్యాచార కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. మహిళలపై జరుగుతోన్న నేరాల్లో అత్యధికంగా 1,11,549 కేసులు ‘భర్త లేదా బంధువుల’ విభాగంలో నమోదైనవి కాగా 62వేల కేసులు కిడ్నాప్‌ కేసులే ఉన్నాయి. మరో 85,392 కేసులు మహిళల మర్యాదకు భంగం కలిగించినవి, 3741 కేసులు అత్యాచారయత్నం కేసులుగా నమోదయ్యాయి. అదే ఏడాది దేశవ్యాప్తంగా 105 యాసిడ్‌ దాడి కేసులు నమోదుకావడం ఆందోళన కలిగించే విషయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు