
Afghanistan: కాబుల్‌లో భారీ పేలుళ్లు.. 19 మంది మృతి?
తాలిబన్ల పాలనలో అఫ్గాన్‌లో వరుస ఘటనలు
కాబుల్: తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్‌లో వరుస పేలుళ్ల ఘటనలు అక్కడివారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా కాబుల్‌లో మరోసారి భారీ పేలుళ్లు సంభవించాయి. వీటికితోడు కాల్పుల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రాజధాని కాబుల్ నగరంలోని మిలటరీ ఆస్పత్రి వద్ద జరిగిన ఈ ఘటనలో దాదాపు 19 మంది మృత్యువాతపడగా మరో 40మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
కాబుల్‌లోని మిలటరీ ఆస్పత్రి ప్రవేశ మార్గంలో వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇస్లామిక్ ఎమిరేట్ (తాలిబన్ల) అధికార ప్రతినిధి సయీద్ ఖోస్తీ ట్విటర్లో వెల్లడించారు. పేలుళ్ల శబ్దం వినిపించిన వెంటనే తమ బలగాలను ఆస్పత్రి వద్దకు పంపించామని అన్నారు. ఆ ఘటనలో ప్రాణనష్టం జరిగిందని పేర్కొన్న ఆయన.. ఎంతమంది చనిపోయారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, 19 మంది మృత్యువాతపడగా.. దాదాపు 40మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడులకు పాల్పడింది ఎవరనే దానిపై స్పష్టత లేనప్పటికీ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనేనని స్థానిక మీడియా పేర్కొంది.
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాలిబన్లకు శత్రువులుగా భావించే వీరి ప్రాబల్యం నంగర్హార్ ప్రావిన్సులో అధికంగా ఉంది. జలాలాబాద్‌లోనూ తాలిబన్ల హత్యలు, దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ గతంలో ప్రకటించుకుంది. తాజాగా అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాబుల్‌లోనూ వరుసగా పేలుళ్లకు పాల్పడుతోంది.