Satyendar Jain: సత్యేందర్ జైన్ మసాజ్ వీడియోలో ట్విస్ట్.. అతడు థెరపిస్టు కాదు రేపిస్టు..!

జైన్‌కు ప్రత్యేక సదుపాయాల వీడియోలో మరో మలుపు వెలుగులోకి వచ్చింది. మసాజ్‌ చేసిన వ్యక్తి నేర చరిత్రను జైలు వర్గాలు వెల్లడించాయి.

Updated : 22 Nov 2022 13:02 IST

దిల్లీ: ఆప్‌ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిలో ఒక ట్విస్ట్‌ బయటకు వచ్చింది. తిహాడ్‌ జైలు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఈ వీడియోలో జైన్‌కు మసాజ్‌ చేస్తోన్న వ్యక్తి పేరు రింకూ. అతడొక ఖైదీ. అత్యాచార కేసులో జైల్లో ఉన్నాడని ఆ వర్గాలు తెలిపాయి. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అతడి కన్న కూతురే ఆరోపణలు చేసింది. దానికింద గత ఏడాది అతడు అరెస్టయ్యాడు.  ‘జైన్‌కు మర్దన చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్టు కాదు. ఒక రేపిస్టు. దీనిని కూడా ఆప్ సమర్థించుకుంటుందా..? వారు తిహాడ్‌ను థాయ్‌లాండ్‌గా మార్చుకున్నారు’ అంటూ భాజపా తీవ్రంగా విమర్శలు చేసింది.

ఆప్‌ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తోంది. అది మసాజ్‌ కాదు..ఫిజియోథెరపీ అంటూ తన వాదనను వినిపిస్తోంది. మనీలాండరింగ్ కేసులో జైన్ జైల్లోనే ఉంటున్నారు. ఇక వచ్చే నెలలో దిల్లీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా ఈ వీడియో ఆప్‌, భాజపా మధ్య తీవ్ర ఘర్షణకు దారితీస్తోంది.

అధికారుల తీరుతో ఆకలితో అలమటిస్తున్నా: జైన్‌

తన మత విశ్వాసాలకు అనుగుణంగా ఆహారం అందించేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ జైన్ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ‘గత ఆరు నెలలుగా ఆయన పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌ మీదే బతుకుతున్నారు. ఖైదీలకు అందుబాటులో ఉండే కోటా కింద వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఆయన జైల్లో కిందపడ్డారు. దాంతో వెన్నెముకకు గాయం అయింది. కొవిడ్ తదనంతర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే గత 12 రోజులుగా ఆయన మత విశ్వాసాలకు అనుగుణంగా జైలులో ఆహారం అందించడం నిలిపివేశారు. అధికారుల వైఖరితో ఆయన ఆకలితో అలమటిస్తున్నారు. విశ్వాసాలకు అనుగుణంగా ఆహారాన్ని పొందడానికి ఆయన అర్హులు’ అని జైన్‌ తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని