Vaccination certificates: ఆ టీకాలు తీసుకున్నవారికే ధ్రువపత్రాలు..!

భారత్‌లో అత్యవసర వినియోగం కింద డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఆమోదించిన కొవిడ్‌ 19 టీకాలను తీసుకున్నవారికి మాత్రమే వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Published : 28 Jul 2021 00:22 IST

దిల్లీ: భారత్‌లో అత్యవసర వినియోగం కింద డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదించిన కొవిడ్‌ 19 టీకాలను తీసుకున్నవారికి మాత్రమే వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లకూ వాటిని అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి ఇచ్చిన టీకాల వివరాలను సంకలనం చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)కు ఓ సమాచార ప్రతిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందజేస్తుందని ఆయన తెలిపారు. దీంతో ధ్రువపత్రాల జారీకి అవసరమైన అన్ని వివరాలను కొవిన్‌ పోర్టల్‌లో నమోదుచేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో అత్యవసర వినియోగం కింద భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌,  రష్యా కంపెనీ తయారు చేస్తున్న స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్లకు డీసీజీఐ ఆమోదం తెలిపింది.

కొవిడ్ కట్టడిలో భాగంగా జులై చివరి నాటికి దేశవ్యాప్తంగా 50 కోట్ల టీకాలు ఇవ్వాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ప్రభుత్వానికి సాధ్యం కాదంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ నెల చివరి నాటికి 51.6 కోట్ల డోసులను అందుబాటులో ఉంచనున్నట్టు ప్రభుత్వం మేలో వెల్లడించినట్టుగా జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని స్పష్టం చేసింది. అవి వ్యాక్సినేషన్‌కు సంబంధించి వాస్తవాలను వక్రీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలేనని వెల్లడించింది. ముందుగా చేసిన కేటాయింపుల అధారంగానే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. అందులో భాగంగా వ్యాక్సిన్లను నెల మొత్తం వివిధ కాల వ్యవధుల్లో సరఫరా చేస్తామని వివరించింది. కేంద్రం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 44.19 కోట్ల డోసులను ప్రజలకు అందజేసింది. వాటిలో 9.60 కోట్ల మందికి రెండు డోసులనూ ఇచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని