Tagore Movie: పాటలు వద్దన్న మురగదాస్‌.. అలా ఛాన్స్‌ దక్కించుకున్న వినాయక్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘ఠాగూర్‌’ (Tagore) ఒకటి. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ‘ఠాగూర్‌’ (20 Years For Tagore) గురించి ఆసక్తికర విశేషాలు..

Updated : 24 Sep 2023 20:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘ఠాగూర్‌’ (Tagore) ఒకటి. 2003 సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, చిరంజీవి రాజకీయ రంగంవైపు వేగంగా అడుగులు వేయడానికి దోహదపడింది. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై 20ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలో ‘ఠాగూర్‌’ (20 Years For Tagore) గురించి ఆసక్తికర విశేషాలు..

  • తమిళంలో విజయ్‌కాంత్‌ కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రమణ’.
  • తెలుగులో ఈ సినిమాను చిరంజీవి రీమేక్‌ చేస్తున్నారని తెలిసి, అందరూ ఆశ్చర్యపోయారు. అందుకు కారణం ‘రమణ’లో ఎలాంటి కమర్షియల్‌ హంగులు ఉండవు. పైగా కీలకపాత్రధారి చివరకు చనిపోతాడు. ఈ విషయాన్ని చిరు ఒక స్నేహితుడితో పంచుకుంటే  ‘సర్‌.. మీ మీద ఈ సినిమా కుదరదు. మీ పాత్ర చనిపోతే, నిర్మాత చనిపోయినట్టే’ అన్నారట.
  • తెలుగులో మొదట దర్శకుడిగా మాతృకను తీసిన మురుగదాస్‌నే అనుకున్నారు. కానీ, ఆయన పాటలు లేకుండానే తీస్తానని షరతు పెట్టారు. పైగా ‘రమణ పాత్ర ఒక త్యాగమూర్తి అది చనిపోకుండా తీయడం కూడా కుదరద’ని అన్నారు. దీంతో చిరంజీవి అప్పటికి ఫామ్‌లో ఉన్న యువ దర్శకుడు వి.వి.వినాయక్‌కు అవకాశం ఇచ్చారు.
  • ఒకరోజు నటుడు రాజా రవీంద్ర వచ్చి, ‘మిమ్మల్ని చిరంజీవి తీసుకురమ్మన్నారు’ అని వినాయక్‌కు చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు.
  • చిరంజీవికి వీరాభిమాని అయిన వినాయక్‌కు అసలు విషయం చెప్పడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ‘రమణ రీమేక్‌ చేయాలనుకుంటున్నాం. ఎలా ఉంటుంది’ అని చిరు అడిగితే ‘మీకు చాలా బాగుంటుంది’ అని వినాయక్‌ సమాధానం చెప్పి, పాటలు, క్లైమాక్స్‌ ఎలా మార్చాలో ఆయనకు వివరించారు.
  • చిరంజీవి సీఎం అయితే, ఎలా ఉంటుంది?ఎలాంటి సంభాషణలు చెబుతారు? అని అప్పటికే వినాయక్‌ ఒక కథ రాసుకుని ఉన్నారు. అందులోని కొన్ని డైలాగ్స్‌కు చిరుకు బాగా నచ్చడంతో వినాయక్‌ను ప్రోత్సహించారు. పరుచూరి బ్రదర్స్‌ పూర్తి సంభాషణలు అందించారు. అలా వినాయక్‌ దర్శకత్వంలో ‘ఠాగూర్‌’ పట్టాలెక్కింది.
  • శ్రియ, జ్యోతికలను కథానాయికలుగా, షాయాజీషిండేను విలన్‌గా ఎంపిక చేశారు. సునీల్‌, ప్రకాశ్‌రాజ్‌, కె.విశ్వనాథ్‌, రమాప్రభ, ఎమ్మెస్‌ నారాయణ, కోట శ్రీనివాసరావు ఇతర పాత్రలు చేశారు.
  • సెప్టెంబరు 24, 2003లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ‘ఏసీఎఫ్‌’ పేరుతో అవినీతిపై ఠాగూర్‌ అనే ప్రొఫెసర్‌ చేసే పోరాటం చూసి, ‘భారతీయుడు’లా ఉందని అన్నారు. కానీ, నెమ్మదిగా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.
  • చిరంజీవి నటన, డ్యాన్స్‌, ఫైట్స్‌, ఆంధ్రప్రదేశ్‌ గణాంకాల గురించి సింగిల్‌ టేక్‌లో చిరంజీవి చెప్పే డైలాగ్‌, క్లైమాక్స్‌లో కోర్టు సీన్‌కు అభిమానులే కాదు, సగటు సినీ ప్రేక్షకుడు ఫిదా అయిపోయాడు. అలాగే ఆ సమయంలో ఆస్పత్రుల్లో జరుగుతున్న మోసాలను ఎత్తి చూపుతూ తీసిన సీన్‌ సినిమాలో మరో హైలైట్‌.  ‘తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించటం’ అంటూ చిరు చెప్పిన డైలాగ్‌ బాగా ఫేమస్‌ అయింది.
  • ఇందులో దర్శకుడు వినాయక్‌ ఒక పాత్ర చేశారు. చిరంజీవి సూచన మేరకే వినాయక్‌ ఆయన విద్యార్థిగా కనిపిస్తారు.
  • మొత్తం 600లకు పైగా థియేటర్‌లలో ‘ఠాగూర్’ విడుదలైంది.  253 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం జరుపుకొన్న తొలి తెలుగు చిత్రంగా ‘ఠాగూర్‌’రికార్డు సృష్టించింది. అంతేకాదు, 191 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
  • శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం..’ గీతాన్ని తీసుకుని, రచయిత సుద్దాల అశోక్‌ తేజ మార్పులు చేసి,  క్లైమాక్స్‌ సాంగ్‌ రాశారు. ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డును అందుకున్నారు.
  • ప్రభుత్వంతో పని చేయించుకోవటం మన హక్కు, ఆ హక్కుని లంచంతో కొనొద్దు అన్న చిరంజీవి స్వరంతోనే సినిమా మొదలై, అదే సంభాషణతో ముగుస్తుంది.
  • ఇందులో బాల నటులుగా నటించిన తేజ సజ్జా, కావ్యా కల్యాణ్‌రామ్‌ ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని