National Film Awards: ‘మా పక్కింట్లో ఒక ఆస్కార్‌, రెండు జాతీయ అవార్డులున్నాయి.. నన్ను అభినందించండి’

జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలందరికీ నెట్టింట శుభాకాంక్షలు వెల్లివిరుస్తున్నాయి. వీరిపై నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌ అందరినీ ఆకర్షిస్తోంది.

Updated : 25 Aug 2023 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంగీత దర్శకుడు కీరవాణి (M. M. Keeravani), గాయకుడు కాలభైరవలకు జాతీయ అవార్డు వస్తే నటుడు బ్రహ్మాజీని (Brahmaji) అభినందించాలట. ఈ కోరికను ఆయనే ట్విటర్ వేదికగా బయటపెట్టారు. ‘మా పక్కింట్లో ఒక ఆస్కార్‌ అవార్డు, రెండు జాతీయ అవార్డులున్నాయి.. అందుకే నన్ను అభినందించండి’ అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు కూడా సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ‘మీ పక్కింట్లో ఉంటున్న అవార్డు విజేతలకు శుభాకాంక్షలు’ అని ఒకరు అనగా.. ‘ఉత్తమ పక్కింటి వ్యక్తి’ అవార్డును మీకే ఇస్తామంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇక కీరవాణి (ఉత్తమ నేపథ్య సంగీతం), కాలభైరవ(ఉత్తమ గాయకుడు)లకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ జాతీయ అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. అలాగే వారితో పాటు తెలుగు సినిమా సత్తా చాటిన విజేతలందరికీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డులు గెలుచుకున్న వారిని ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందించగా.. తాజాగా మరికొందరు వారిని విష్ చేశారు. 

తెలుగు సినిమా గర్వపడే క్షణమిది: ‘నేషనల్‌ అవార్డ్స్‌’పై ప్రముఖుల హర్షం

‘జాతీయ అవార్డులు గెలుచుకున్న వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరంతా ఈ అవార్డులకు అర్హులు’ అంటూ హీరో మహేశ్‌ బాబు ట్వీట్‌ చేయగా.. ‘ఎంతో గర్వంగా ఉంది. 69వ జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలందరికీ శుభాకాంక్షలు. సినీ రంగమంతా మిమ్మల్ని చూసి గర్వపడుతుందంటూ’ పురస్కారం పొందిన ప్రతి ఒక్కరినీ రామ్‌ చరణ్‌ అభినందించారు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్‌లో అల్లు అర్జున్‌పై ట్వీట్‌ చేశారు. ‘కింది స్థాయి నుంచి కష్టపడితేనే విజయం వస్తుంది. ఒక స్టార్ కమెడియన్‌కు మనవడిగా అటు బాక్స్‌ఫీసుతో పాటు.. ఇటు అవార్డుల్లోనూ నువ్వు సూపర్‌ హీరో అని నిరూపించుకున్నావు’’ అంటూ అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు పురస్కారాన్ని గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని