Suman: అలా చేయకపోయి ఉంటే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అయ్యేది.. ‘ఆదిపురుష్‌’పై సుమన్‌ కామెంట్స్‌ వైరల్‌!

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు సుమన్‌. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated : 21 Jun 2023 19:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ‘ఆదిపురుష్‌’ (adipurush) ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాని కొందరు బాగుందని ప్రశంసిస్తే, కొందరు విమర్శించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు సుమన్‌ (Suman) ‘ఆదిపురుష్‌’కు వస్తున్న మిశ్రమ స్పందనలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..?

‘‘సీతను రావణుడు అపహరించే ఘటన నుంచి ఆమెను రక్షించడం వరకు ఈ చిత్రంలో చూపించారు. అయితే, ఈ సినిమాలో రామాయణం మొత్తాన్ని చూపించి ఉంటారని చాలామంది అనుకున్నారు. ఈ క్రమంలో కొంత నిరుత్సాహం ఎదురైంది. తాము అనుకున్నంత పోర్షన్‌ వరకు ‘ఆదిపురుష్‌’ టీమ్‌ బాగా తెరకెక్కించింది. ఎన్నో సినిమాల్లో రాముడి పాత్రను నీలి రంగులో చూపించడంతో ఆయన అలానే ఉంటాడనే అభిప్రాయం ఏర్పరచుకున్నాం. రాముడంటే మీసం, గడ్డం ఉండవని భావిస్తాం. నందమూరి తారక రామారావుగారిని రాముడి పాత్రలో బ్లూ కలర్‌ మేకప్‌తో, మీసం, గడ్డం లేకుండా చూశాం. ఆ రూపమే ఎక్కువగా మన మదిలో మెదులుతుంది. ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ శరీరాకృతి బాగుంది. దాదాపు రెండున్నరేళ్లపాటు బాడీని అలా మలుచుకోవడం చాలా కష్టం. అందుకు ఆయనకు హ్యాట్సాఫ్‌. కానీ, మీసం, గడ్డంతో రాఘవుడి పాత్రలో ప్రభాస్‌ (Prabhas)ను నేను అంగీకరించలేకపోయా. క్యారెక్టర్ల విషయంలో నాకు రావణాసురుడు నచ్చాడు. అయితే, ఆ పాత్ర పోషించిన సైఫ్‌ అలీఖాన్‌కు మోడ్రన్‌ హెయిర్‌ కటింగ్‌ చేయడం తప్పు. కొన్ని సన్నివేశాల్లో పొడవాటి జుట్టుతో బాగానే చూపించారు. ఇతర పాత్రల విషయంలోనూ దర్శకుడు ప్రయోగం చేశారు’’

‘‘కొన్ని సీన్లలోని గ్రాఫిక్స్‌ అద్భుతంగా ఉంది. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం నచ్చింది. రామాయణాన్ని వేరే కోణంలో చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రాముడికి ఎంత శక్తి ఉంటుందో యుద్ధ సన్నివేశాల్లో సరిగా చూపించలేకపోయారు. ఒకే బాణం నుంచి పది, వంద బాణాలు రావడం కాకుండా ఇందులో ఒక్కో బాణం వేయడమేది డైరెక్టర్‌ కాన్సెప్ట్‌. అందులో ప్రభాస్‌ తప్పేం లేదు. గెటప్పులు మార్చడం పెద్ద రిస్క్‌. ప్రేక్షకులు వాటిని అంగీకరించలేకపోయారు. ఇలాంటి కొన్ని తప్పిదాలు వారు చేయకపోయి ఉంటే ‘ఆదిపురుష్‌’ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అయి ఉండేది’’ అని వివరించారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్‌.. జానకిగా కనిపించి, మెప్పించారు. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో 3డీలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఇప్పటి వరకు రూ. 395 కోట్ల (గ్రాస్‌)కుపైగా వసూళ్లు రాబట్టింది.

ఆదిపురుష్‌ రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని