Lavanya Tripathi: మానవత్వం చాటుకున్న లావణ్య త్రిపాఠి.. అనాథ విద్యార్థులకు కానుక

హైదరాబాద్ ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహంలో సినీ నటి లావణ్య త్రిపాఠి సందడి చేశారు. అక్కడి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. 

Published : 24 Apr 2023 22:17 IST

హైదరాబాద్‌: సినీ నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మానవత్వం చాటుకున్నారు. ఎల్బీనగర్‌లోని అనాథ విద్యార్థి గృహంలోని పిల్లలకు కావాల్సిన అత్యవసర మందులను కానుకగా అందించారు. వారి మోముల్లో చిరునవ్వులు తీసుకొచ్చారు. విధి రాతలో అమ్మానాన్నలను దూరం చేసుకున్న ఎంతో మంది విద్యార్థులు ఈ గృహంలో చదివి ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడుతున్నారనే విషయం తెలుసుకున్న ఆమె.. ఓరోజు వారితో సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అనాథ విద్యార్థి గృహాన్ని సందర్శించి అక్కడి విశేషాలను వ్యవస్థాపకులు మార్గం రాజేశ్‌ను అడిగితెలుసుకున్నారు.

విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తి కలిగించాయని ఆనందం వ్యక్తం చేసిన లావణ్య.. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిన్నారు. అనంతరం, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తనది సినీ నేపథ్యమున్న కుటుంబంకాదని, అయినా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టానని, 11 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని మంచి నటిగా ఎదిగానని తెలిపారు. సినిమాల్లో తనకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు, ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. డిసెంబర్‌లో తన పుట్టినరోజు సందర్భంగా మరోసారి సందర్శిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ‘అందాల రాక్షసి’తో తెరంగేట్రం చేసిన లావణ్య తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘హ్యాపీ బర్త్‌డే’ తదితర చిత్రాల్లో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని