Published : 12 May 2022 17:08 IST

Adivi Sesh: సన్నీ లియోనీ వల్ల నా పేరు మార్చుకున్నా: అడివి శేష్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన అసలు పేరు అడివి సన్నీ చంద్ర అని, నటి సన్నీ లియోనీ బాగా ఫేమస్‌ అయిన రోజుల్లో స్నేహితులంతా తనను సన్నీ లియోన్‌ అంటూ ఏడిపించేవారని, అందుకే పేరు మార్చుకున్నానని నటుడు అడివి శేష్‌ తెలిపాడు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సస్పెన్స్‌ థ్రిల్లర్లతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచిన కథానాయకుడాయన. శేష్‌ నటించిన తాజా చిత్రం ‘మేజర్‌’ జూన్‌ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశాడు. వ్యక్తిగత, వృత్తిపరమైన ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

26/11 ముంబయి ఉగ్రదాడుల్లో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ ఎలా చనిపోయారో చాలామందికి తెలుసని, ఆయన ఎలా బతికారో మేజర్‌ చిత్రం ద్వారా చూపించబోతున్నామన్నాడు. నటుడు మహేశ్‌బాబు ఆ సినిమాకి వెన్నెముకలా నిలిచారన్నాడు. తాను హైదరాబాద్‌లో పుట్టానని, అమెరికాలో పెరిగానని చెప్పాడు. హాలీవుడ్‌ సినిమాల్లో భారతీయ నటులు హీరోలు అవలేరని, చిన్న చిన్న పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుందనే కారణంగా అక్కడ నటుడిగా మారలేదని వివరించాడు. ‘చందమామ’ సినిమాలో నవదీప్‌ పాత్ర కోసం ముందుగా తననే తీసుకున్నారని, తర్వాత ఈ క్యారెక్టర్‌ సెట్‌ అవ్వకపోవడంతో ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసినట్టు తెలిపాడు. ‘బాహుబలి’లో తాను పోషించిన పాత్రకు తల్లి ఎవరో దర్శకుడు రాజమౌళికీ తెలియదని నవ్వులు పంచాడు. శేష్‌తోపాటు చిత్ర కథానాయిక సయీ మంజ్రేకర్‌ సందడి చేసింది. ‘కొంచెం కొంచెం’ తెలుగులో మాట్లాడి అలరించింది. ఈ పూర్తి ఎపిసోడ్‌ ‘ఈటీవీ’లో సోమవారం రాత్రి 9:30 గం.లకు ప్రసారంకానుంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని