Muttiah Muralitharan: మురళీధరన్‌ బయోపిక్‌.. విజయ్‌ సేతుపతి స్థానంలో ఇతనే!

శ్రీలంక మాజీ క్రికెటర్‌, స్పిన్‌తో అద్భుతాలు చేసి, క్రికెట్‌ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న ఆటగాడు ముత్తయ్య మురళీధరన్‌. ఆయన బయోపిక్‌ మళ్లీ పట్టాలెక్కింది. మురళీధరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పాత్ర పోషించే నటుడి వివరాలను చిత్ర బృందం వెల్లడించింది.

Updated : 29 Oct 2023 10:49 IST

చెన్నై: శ్రీలంక వెటరన్‌ క్రికెటర్‌, స్పిన్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ (Muttiah Muralitharan) జీవిత కథ ఆధారంగా ‘800’ అనే బయోపిక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మురళీధరన్‌ పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిని చిత్ర బృందం ఎంపిక చేసింది. అంతేకాదు, చిత్ర మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఈ ప్రాజెక్టు నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకొన్నారు. దీంతో గత కొన్ని నెలలుగా వాయిదా పడిన ఈ చిత్రం మళ్లీ ఇప్పుడు పట్టాలెక్కింది. మురళీధరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో మురళీధరన్‌ పాత్రను మాధుర్‌ మిత్తల్‌ (Madhur Mittal) పోషిస్తున్నారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఫస్ట్‌లుక్‌ క్రియేటివ్‌గా డిజైన్‌ చేసి ప్రేక్షకులతో పంచుకుంది. ఎం.ఎస్‌. శ్రీపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

విజయ్‌ సేతుపతి పేరు ప్రకటించగానే విమర్శలు రావడంతో మురళీధరన్‌ స్వయంగా విజయ్‌ను తప్పుకోమని సూచించారు. తన వల్ల ఒక నటుడి కెరీర్‌ నాశనం కావడం ఇష్టం లేదని అప్పుడు చెప్పారు. ఇప్పుడు సినిమాలో నటిస్తున్న మాధుర్‌ మిత్తల్‌ ఎవరో కాదు, ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’లో సలీమ్‌ మాలిక్‌ పాత్ర పోషించిన బాల నటుడే మాధుర్‌. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ‘మైదాన్‌’లో నటిస్తున్నాడు. ఇక మురళీధరన్‌ తన క్రికెట్‌ కెరీర్‌లో 133 టెస్టులు, 350 వన్డేలు, 12 టీ20 మ్యాచ్‌లను ఆడాడు. మొత్తం 800 వికెట్లను తీశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని