Sakshi vaidya: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు ఆశ్చర్యపోతున్నా: సాక్షి వైద్య

‘ఏజెంట్‌’ హీరోయిన్‌ సాక్షి వైద్య (Sakshi Vaidya) మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకుంది.

Updated : 28 Apr 2023 00:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఖిల్‌ (Akhil) హీరోగా సురేందర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘ఏజెంట్‌’. స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో అఖిల్‌ సరసన సాక్షి వైద్య (Sakshi Vaidya) నటించింది. ‘ఏజెంట్‌’ (Agent) రిలీజ్‌ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. తొలి సినిమా విడుదలకు ముందే పెద్ద ప్రాజెక్ట్‌లలో అవకాశాలు సొంతం చేసుకున్న ఈ అమ్మడు చెప్పిన ‘ఏజెంట్‌’ విశేషాలేంటో చూసేయండి..

‘ఏజెంట్‌’లో మీ పాత్ర గురించి చెప్పండి. ఈ అవకాశం ఎలా వచ్చింది?
సాక్షి వైద్య: పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘ఏజెంట్‌’ తెరకెక్కింది. కొవిడ్‌ సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకని సోషల్‌మీడియాలో రీల్స్‌ చేశాను. అప్పుడు మా ఫ్రెండ్స్‌ ఆడిషన్స్‌కు వెళ్లమని చెప్పారు. ముంబయిలో ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని సినిమాలకు ఎంపికయ్యాను. కానీ స్క్రిప్ట్‌ నచ్చక వాటిని అంగీకరించలేదు. ఆ తర్వాత ‘ఏజెంట్‌’ ఆఫర్‌ వచ్చింది. ఇందులో నా పాత్రకు పైలట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటుంది. ప్రేమపై అసలు నమ్మకం ఉండదు. అలాంటి అమ్మాయి ప్రేమలో ఎలా పడిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అఖిల్‌ గురించి చెప్పండి. ఆయనతో డ్యాన్స్‌ చేయడం ఎలా అనిపించింది?
సాక్షి వైద్య: నేను సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి రాలేదు. ఈ సినిమాలో అఖిల్‌తో కలిసి నటించడం వల్ల నాగార్జున గారి నుంచి చాలా విషయాలు తెలుసుకున్నా. నాగార్జున గారు నన్ను ఎలా చూశారో అఖిల్‌ కూడా అలానే చూశాడు. చాలా మంచి వాళ్లు. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు ఆశ్చర్యపోతున్నా. వాళ్లు నా నటన చూడకముందే నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. చాలా నమ్మకాన్ని ఇస్తున్నారు. ఇక డ్యాన్స్‌ విషయానికొస్తే నేను భరతనాట్యం నేర్చుకున్నా. నేను, అఖిల్ ఇద్దరం డ్యాన్స్‌ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం.

‘ఏజెంట్’ విడుదలకు ముందే మరో పెద్ద సినిమాలో అవకాశం రావడం ఎలా అనిపిస్తోంది. తెలుగు నేర్చుకున్నారా?
సాక్షి వైద్య: చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ‘ఏజెంట్‌’ విడుదలయ్యాక చెబుతాను. ‘ఏజెంట్‌’లో నా భాష రాయలసీమ ప్రాంత భాషను పోలి ఉంటుంది. తెలుగు నేర్చుకోవడం కోసం క్లాసుల్లో జాయిన్‌ అయ్యాను. తెలుగు సినిమాలు చూస్తున్నాను. 

‘ఏజెంట్‌’లో మీ పాత్ర ప్రాధాన్యం గురించి చెప్పండి?
సాక్షి వైద్య: పాత్రకు ప్రాధాన్యముందా.. లేదా అన్నది ముఖ్యం కాదు. ‘ఏజెంట్‌’ నా తొలి సినిమా. మొదటి సినిమాలోనే ఇలాంటి పాత్ర రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది. ‘ఏజెంట్‌’ కంటే ముందు కొన్ని ప్రకటనల్లో నటించాను. 

సినిమా షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ మీపై కోపడ్డారట. నిజమేనా?
సాక్షి వైద్య: ఒక దర్శకుడిగా ఆయనపై చాలా ఒత్తిడి ఉంటుంది. నేను దాన్ని అర్థం చేసుకోగలను. కొన్ని సీన్స్‌లో నటించేటప్పుడు ‘ఇది బాగుంది. కానీ, ఇంకా బాగా చేయండి’ అని చెప్పేవారు. నేను దానికి తగినట్లు మెరుగ్గా ఎలా చేయాలా అని ఆలోచించేదాన్ని. ఒక సినిమా వెనుక చాలా మంది కష్టం ఉంటుంది. సురేందర్‌ రెడ్డి (Surender Reddy) కొన్ని రోజులు వీల్‌ఛైర్‌లో ఉంటూ కూడా షూటింగ్‌కు వచ్చారు. ఆయనకు సినిమా అంటే అంత ఇష్టం.

‘ఏజెంట్‌’ కంటే ముందు తెలుగులో ఆఫర్లు వచ్చాయా?
సాక్షి వైద్య: వచ్చాయి. కొంతమంది నిర్మాతలు ఫోన్‌ చేసి సినిమాల గురించి చెప్పారు. కానీ, పూర్తి వివరాలు చెప్పలేదు. ‘ఏజెంట్‌’ అవకాశం వచ్చినప్పుడు కూడా అఖిల్‌ హీరో అని తెలీదు. ఇంత మంచి సినిమాను అంగీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాకు,  మమ్ముట్టి గారికి మధ్య సన్నివేశాలు లేవు. ఈ సినిమాలో నటించిన వాళ్లందరూ చాలా అనుభవం ఉన్న వాళ్లు. వాళ్లతో కలిసి ఎలా నటిస్తానా అని మొదట భయపడ్డాను. కానీ వాళ్లందరూ చాలా సాయం చేశారు. 

హీరోయిన్ అవుతానని అనుకున్నారా?
సాక్షి వైద్య: లేదు. కొవిడ్‌ సమయంలో నటనపై ఆసక్తి కలిగింది. అప్పుడు ఆడిషన్స్‌ ఇవ్వడం మొదలుపెట్టాను. అలా ఆడిషన్స్‌కు వెళ్లడం నాకు చాలా నచ్చింది. సినిమాలో అవకాశం వచ్చాక యాక్టింగ్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాను. 

మీ అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్స్‌ గురించి చెప్పండి?
సాక్షి వైద్య: ప్రస్తుతానికి వరుణ్‌తో కలిసి ‘గాండీవధారి అర్జున’ చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు