‘అష్టాచమ్మా’ ఆడిషన్స్‌కు వెళ్లాను కానీ...!

వారిది బుల్లితెర కలిపిన బంగారు జీవితం. ప్రేక్షకుల మనసెరిగిన డాక్టర్‌బాబుగా అలరించిన నటుడు ఒకరయితే, ఆమె తన అభినయంతో ఆకట్టుకున్న

Updated : 13 May 2022 12:17 IST

వారిది బుల్లితెర కలిపిన బంగారు జీవితం. ప్రేక్షకుల మనసెరిగిన డాక్టర్‌బాబుగా అలరించిన నటుడు ఒకరైతే, తన అభినయంతో ఆకట్టుకున్న అందాల చంద్రముఖి ఇంకొకరు. బుల్లితెరపై తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొంది వారి కుటుంబంలో ఒకరిగా ఒదిగిపోయి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ జోడీ పరిటాల నిరుపమ్‌ - మంజుల. ప్రస్తుతం బుల్లితెర శోభన్‌బాబుగా అలరిస్తున్న నిరుపమ్‌ ఒకనాటి నటుడు, డైలాగ్‌ రైటర్ ఓంకార్ తనయుడే. తాజాగా తన భార్య మంజులతో కలిసి ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చారు. ఆలీ అడిగిన సరదా ప్రశ్నలకు నిరుపమ్‌ దంపతులు ఎలాంటి సమాధానాలు చెప్పారో.. ఆ సంగతులు ఏంటో తెలుసుకుందాం...!

విజయవాడ, చెన్నై, హైదరాబాద్‌ ఈ కథేంటి?

నిరుపమ్‌: మాది విజయవాడ. నా చదువుంతా చెన్నైలోనే సాగింది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నాం. నాన్న ఓంకార్‌. సినిమా రచయిత, నటుడు. చెన్నైలో ఉండేవారు. అమ్మ లెక్చరర్‌. కొంతకాలం గుడివాడలోనూ చదువుకుని మళ్లీ తిరిగి హైదరాబాద్‌ వచ్చా. ఇలా రకరకాలుగా తిరిగి ఇక్కడికి వచ్చా.

మీ సొంతూరు ఏది?

మంజుల: బెంగళూరు. నా మొదటి సీరియల్ చంద్రముఖి(ఈటీవీ) కోసం హైదరాబాద్‌ వచ్చా. నాకూ నిరుపమ్‌కు అదే తొలి సీరియల్‌. ఆరున్నరేళ్లు టెలికాస్ట్‌ అయింది. (మధ్యలో నిరుపమ్‌ కల్పించుకుని ‘అన్ని ఏళ్లు పడుతుందని తెలిసే ఇక్కడ ఆధార్‌ కార్డు ఇప్పించా)

ఆధార్‌ కార్డు ఇప్పించావు బాగానే ఉంది. ఇంకేమి ఇప్పించారు?

నిరుపమ్‌: ఇక వరుసగా పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్ ఇక్కడ ఉండటానికి సరిపడా ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేశా. (మధ్యలో మంజుల కల్పించుకుంటూ.. లైఫ్‌టైమ్  కార్డు కూడా ఇప్పించారు)

మీకు పెళ్లి ఎప్పుడు జరిగింది? ఎంతమంది పిల్లలు?

నిరుపమ్‌: - మంజుల: 2009లో పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక బాబు. 

మీ పెళ్లినాటికి నాన్న (ఓంకార్‌) లేరు కదా..!

నిరుపమ్‌: 2007లో చనిపోయారు. అప్పటికి నా జీవితం గురించి ఏమీ అనుకోలేదు. మేం అప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం. నేను సినిమాల్లోకి వెళ్తానని, నాకోసం వాళ్లు హైదరాబాద్‌ వచ్చేశారు. నిజానికి నాన్నకి ఆ అవసరం లేదు. సీరియల్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. నాకోసం హైదరాబాద్‌ వద్దామనుకున్నారు. ఇక్కడ ఇల్లు కూడా చూశాం. కానీ, ఇంతలోనే గుండెపోటుతో చనిపోయారు.

రచయితగా మీ నాన్న.. ఎన్ని సినిమాలు, సీరియల్స్ రాశారు? బాగా పేరు తీసుకొచ్చిన సీరియల్‌ ఏది?

నిరుపమ్‌: దాదాపు పాతిక సినిమాల వరకూ రచయితగా పనిచేశారు. సీరియల్స్ అయితే యాభై వరకూ రాసి ఉంటారు. ‘ఇది కథ కాదు’, ‘పవిత్ర బంధం’, ‘కలిసుందాం రా’. ఏ సీరియల్‌ తీసుకున్నా వాటిలో దామోదరం అనే పేరు పెట్టుకుంటారు. ఇది మా తాతయ్య పేరు. ఆయనకు మెడికల్‌షాపు ఉండేది.

మీ నాన్నకు చిత్రసీమలోకి రావాలని ఎందుకు అనిపించింది?

నిరుపమ్‌: నాన్నకి సాహిత్యం అంటే చాలా ఇష్టం. పెళ్లికి ముందే న్యూస్‌ రీడర్‌గా ఆల్‌ ఇండియా రేడియోలో పని చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ పేపర్‌కి ఆర్టికల్స్ రాసేవారు. అక్కడ పనిచేసే ఒక ఎడిటర్‌ నాన్నని ప్రోత్సహించడంతో, అలా నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ను కలిశారు. ‘పోలీస్‌ భార్య’ చిత్రంలో నటుడిగా నాన్నకు మంచి పేరొచ్చింది.

ఇంతకీ మీ ఆవిడ సంగతేంటి?

నిరుపమ్‌: నా కెరీర్‌ ప్రారంభించింది ‘ఈటీవీ’లో వచ్చిన ‘చంద్రముఖి’ సీరియల్‌తోనే. చంద్రముఖి (మంజుల వైపు చూస్తూ) దొరికింది. నాకు మంచి పేరొచ్చింది.

మరి మీ అమ్మకి ‘చంద్రముఖి’ మంజుల నచ్చిందా?

నిరుపమ్‌: నేను తీసుకునే నిర్ణయాల మీద అమ్మకి చాలా నమ్మకం. ‘ఒకసారి ఇంటికి తీసుకురా మాట్లాడదాం’ అని చెప్పింది.

మీ కుటుంబ సభ్యులు ఎంతమంది?

మంజుల: మొత్తం మేం నలుగురం. నేను రెండోదాన్ని. అక్క, నా తర్వాత పుట్టిన చెల్లి నటన వైపు రాలేదు. నేనూ, నాలుగో చెల్లి చిత్రరంగంలోకి వచ్చాం. కీర్తి ఇక్కడే తెలుగులో సీరియల్స్‌లో నటిస్తోంది. ఆమెకి పెళ్లయింది. ఆమె భర్త కూడా ఇదే రంగంలో ఉన్నారు.

‘నాన్న జీవించి ఉంటే నా సక్సెస్‌ని చూసి ఆనందించేవారు’ అని ఎప్పుడైనా అనిపించిందా?

నిరుపమ్‌: చాలా సార్లు. అసలు నేను సినిమా రంగంలోకి వెళ్లాలనుకున్నా. అయితే, నాన్నకి ఇష్టం లేదు. అందుకే నా చుట్టుపక్కల సినీ వాతావరణం ఉండేనిచ్చేవారు కాదు. అప్పుడప్పుడు మా ఇంటికి అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ వచ్చేవారు. నేను వాళ్లతో సరదాగా మాట్లాడుతుంటే, ‘వెళ్లి పనిచూసుకో’ అంటూ చెప్పేవారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తానని అందరూ అనుకున్నారు. ఇంజినీరింగ్‌ అయిపోయిన తర్వాత ఒకరోజు నాన్న నన్ను చెన్నైలోని ఆంధ్రాక్లబ్‌ తీసుకెళ్లి ‘ఇంజినీరింగ్ అయిన తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు’ అని అడిగారు. ‘నేను కూడా కళామాతల్లికి సేవ చేసుకోవాలని ఉంది’ అన్నాను. అంతే అక్కడి నుంచి వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. ఆరోజు ఆయనకి నిద్రపట్టలేదు. అమ్మ వాళ్ల తోబుట్టువులు ఏడుగురు. వాళ్లంతా ప్రిన్సిపల్స్‌, టీచర్లు. వారిలా ఏదో ఉద్యోగం చేసుకుంటానని అనుకుంది. నేను సినిమా అనే సరికి అమ్మకి కోపం వచ్చి ‘ఏంటి ఇంత చదువు చదివించింది ఇందుకోసమేనా’ అని ఏడ్చేసింది. ఇక నాన్న మాత్రం ఒక్కటే చెప్పారు. ముందు చదువు పూర్తి చేసుకో ఆ తర్వాత ఓ నిర్దిష్ట సమయం పెట్టుకొని ప్రయత్నించు సలహా ఇచ్చారు. ఓ సారి నన్ను ‘మా సీరియల్లో హీరో వేషం ఉంది. చేస్తావా’ అని అడిగారు. నేను సినిమాల్లో తప్ప సీరియల్స్ చేయనని చెప్పా. కొన్ని తమిళ సినిమాల్లో ప్రయత్నించా.

మీరు సీరియల్స్‌లోకి ఎలా వచ్చారు?

మంజుల: నేను నటించాలని అనుకోలేదు. అలాంటి ఆశలు కూడా పెట్టుకోలేదు. ఓసారి ఆడిషన్‌ జరుగుతుంటే మా నాన్న స్నేహితులు ‘మీ అమ్మాయి బాగుంటుంది కదా. ఆడిషన్స్‌కు పంపించు’ అని చెప్పారు. అప్పుడు నేను ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నా. ఆడిషన్‌ ఇచ్చిన మొదటిసారే సెలక్ట్‌ అయ్యాను. కన్నడలో ఆర్కా మీడియాలో చేసేటప్పుడే తెలుగులోనూ వాళ్లే చేస్తున్నారు. అప్పుడే నన్ను తెలుగులో నటించమని అడిగారు. నేను మాత్రం చెయ్యనని అని చెప్పా. ఎందుకంటే నాకు భాష తెలియదు. వేరే రాష్ట్రం. ఇక్కడ తెలిసిన తెలుగు స్నేహితులు కూడా ఎవరూ లేరు. నాకు కష్టమవుతుందని చెప్పా. కానీ, వాళ్లు నన్ను ప్రోత్సహిస్తూ, కన్నడ తెలిసిన కో-డైరక్టర్‌ను పెట్టారు. అప్పుడు ఒప్పుకొన్నా. అలా తెలుగులో ‘చంద్రముఖి’తో నా కెరీర్‌ ప్రారంభమైంది.

నిరుపమ్‌ని మొదటిసారి చూడగానే మీ మదిలో ఏమనిపించింది?

మంజుల: నిరుపమ్ వైపు చూస్తు (నవ్వుతూ).. అప్పుడాయన చాలా సన్నగా ఉండేవారు. (మధ్యలో నిరుపమ్ కల్పించుకుంటూ ‘అప్పుడు నేను గుండుతో ఉన్నాను (అప్పటికే నాన్న చనిపోయారు). నన్ను చూసి ఇంతకంటే మంచి హీరో దొరకలేదా? చెన్నై నుంచి తీసుకురావాలా అని అంది’) ఆయన నటన చూసి మంచి అభిప్రాయం కలిగింది. కొత్తగా ఎవరైనా యాక్టింగ్‌లోకి వస్తే తెలిసిపోతుంది. కానీ, ఆయన నటన అలా అనిపించలేదు. బాగా చేశారు. 

మీ ఇద్దరు ముద్దుగా ఏమని పిలుచుకుంటారు?

నిరుపమ్‌  నేను మంజూ అని పిలుస్తా.

మంజుల: పెళ్లికి ముందైతే గుండు.. లడ్డులాంటి పేర్లతో. ముద్దొచ్చినప్పుడు బక్కోడా అని పిలుస్తా!

మీ ఆయన్ని రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు శోభన్‌బాబు అని అంటారట?

మంజుల: అవును నేనూ విన్నాను.

కథ వినాలన్నా.. సీరియల్‌ చేయాలన్నా ‘ఇద్దరు నాయికలు ఉంటేనే చేస్తా’ అని చెబుతారట?

నిరుపమ్‌: అలాంటిదేమీ లేదు. ‘మీరు సీరియల్ చేయాలంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందేనా’ అని పదే పదే అడుగుతూ ఉంటే అలా ఉంటేనే చేస్తాను అని ఏదో చిరాకుగా ఉన్నప్పుడు చెప్పాను. 

అదే చిరాకుతో ఓ పెద్ద దర్శకుడితో ‘మీ ఆడిషన్స్ పూర్తయితే నేను టీవీ సీరియల్స్‌ వెళ్లాలి’ అన్నారట ఎవరా దర్శకుడు?

నిరుపమ్‌: నాకు వేరే దారిలేక ఆ మాట చెప్పాల్సి వచ్చింది. సీరియల్‌ అనగానే ఓ చిన్నచూపు. ఆడిషన్స్‌కు పిలిచినప్పుడు ఆ పని చేయాలి కదా. కానీ, ఏం చెప్పకుండా సీరియల్‌ చేస్తున్నానే మాట విని పంపిస్తే, ఎవరికైనా బాధ కలుగుతుంది. బాగా తెలిసిన వాళ్లుంటేనే ఆడిషన్స్‌కి వెళ్తా. దూసుకుపోయే మనస్తత్వం కాదు నాది.

‘అష్టాచమ్మా’లో అవకాశం చేజారిపోయిందట?

నిరుపమ్‌: అవును. నాకో సీన్‌ కూడా ఇచ్చారు. దానికోసం ప్రిపేరయ్యా. కానీ, సాయంత్రం నా సీరియల్ చూసి, ‘మీరు టీవీలో నటిస్తున్నారా? అయితే ఓకే’ అన్నారు. ‘నేను ఆడిషన్స్ ఎప్పుడు రావాలి’ అని అడిగితే ‘ఇంకెందుకూ’ అని అన్నారు. నాలా ఎంతోమంది అవకాశాలు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ‘ఇతనికి కూడా ఓ మంచి రోల్ ఇద్దాం’ అని ఆలోచించే ఎవరో ఒకరు ఉంటారు కదా!

మీ ఇంటిపేరుతో ఒక ఫేమస్‌ పర్సన్‌ ఉన్నారని మీకు తెలుసా?

నిరుపమ్‌: పరిటాల రవి. ఆయన పేరు వాడి ‘ఇంద్ర’ సినిమా టికెట్‌ సంపాదించా(నవ్వులు)

ఆమె కూడా పరిటాల ఇంటి పేరును ఉపయోగించుకుందట?

నిరుపమ్‌: లైసెన్స్ కోసం. డ్రైవింగ్‌ టెస్ట్‌కి వెళ్లాను. నా పేరు చూసి ‘వారి కుటుంబానికి మీరు బంధువులా’ అని అడిగారు. ‘లైసెన్స్ రావాలి కదా’ అవును అని చెప్పా. వెంటనే సీల్‌ వేసి ఇచ్చారు.

మీ నాన్న నిన్ను హీరోగా చేయడానికి ఓ కథ చెప్పి ఒప్పించారట. ఇది నిజమేనా?

నిరుపమ్‌: అవును సినిమా కథా చర్చలు జరిగాయి. ‘నాన్నే నా కెరీర్‌ను చూసుకుంటారులే’ అని సినిమా వాళ్లతో పెద్దగా పరిచయాలు పెంచుకోలేదు. డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నా. వివిధ సినిమా ఆఫీస్‌లకు నా ఆల్బమ్స్‌ కూడా నాన్నే పంపారు. హైదరాబాద్ వచ్చేశాక ఆ ప్రాసెస్‌ జరుగుతుందని అనుకున్నా. ఈలోపు నాన్న చనిపోయారు. ఎవరితో మాట్లాడాలో నాకు తెలియలేదు. మళ్లీ నా జీవితం మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టినట్లు అయ్యింది.

ఏదో సీరియల్ చేసిన తర్వాత మీకు బెదిరింపులు వచ్చాయట?

నిరుపమ్‌: చంపేస్తామని కాదు కానీ, ‘బాగా పేరొచ్చిందని పొగరా? ఏం చూపించినా చూస్తారనుకుంటున్నావా? చెప్పుల దండేసి సన్మానం చేస్తాం’ ఇలా వార్నింగులు వచ్చాయి. ఇదంతా పాత్రల మీద వారు పెంచుకున్న అతి ప్రేమ. సీరియల్‌ని సీరియల్‌గా చూస్తే ఏం కాదు. ఇప్పుడు నా మీద మీమ్స్ కూడా వస్తున్నాయి అంటే గొప్పే కదా! సినిమాలకు తప్ప సీరియల్స్ మీద రావడం చాలా అరుదు.

మీకు మహిళా అభిమానులు ఎక్కువ కదా? లెటర్స్, కాల్స్ ఏమైనా వస్తుంటాయా?

నిరుపమ్‌: అవును కాల్స్ వస్తుంటాయి. మొబైల్‌ నా దగ్గరే ఉంటుంది. పాత్ర పేరు చెప్పి మాట్లాడుతున్నారంటే అభిమానులే అని తెలిసిపోతుంది. అలా ఓసారి బ్రహ్మానందంగారు ఫోన్‌ చేశారు. కాల్‌ ఏదో తేడాగా ఉందని, ‘రాంగ్ నంబర్‌’ అని ఫోన్‌ కట్‌ చేశా. తర్వాత ట్రూ కాలర్‌లో చూస్తే ఆయన పేరే వచ్చింది. తర్వాత ఆయనకు ఫోన్‌ ఎలా చేయాలనే డైలామాలో ఉండగానే మళ్లీ ఆయనే చేశారు. అప్పుడు సారీ చెప్పాను. ఫర్వాలేదు. నేను కూడా అలానే చేస్తుంటాలే అని చెప్పి, బాగా చేశావయ్యా అంటూ మెచ్చుకున్నారు. అన్ని సినిమాలు చేసిన బ్రహ్మానందంగారి నుంచి కాంప్లిమెంట్ రావడం చాలా గ్రేట్‌.

ఏదైనా సినిమాల్లో నటించారా? వాటిల్లో నటించే అవకాశం ఎలా వచ్చింది?

నిరుపమ్‌: రెండు సినిమాల్లో నటించా. అల్లరి నరేష్ ‘ఫిటింగ్‌ మాస్టర్‌’, ఎన్టీఆర్‌ ‘రభస’.  ఈవీవీ సత్యనారాయణగారిని ఓసారి కలిసి ఏదైనా మంచి పాత్ర ఉంటే ఇవ్వండి అని అడిగా. ‘సరే చూద్దాం’ అన్నారు. ‘ఈయన కూడా అందరిలాంటివారే’ అని అనుకున్నా. కానీ, ఆ తర్వాత ఆయన నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ఒకసారి వచ్చి మీ డేట్స్ ఇచ్చేసి వెళ్లండి’ అన్నారు. చాలా సంతోషం వేసింది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశా. చాలా మంచి పాత్ర.

మీ భర్తలో ఉన్న మంచి లక్షణం, చెడ్డ లక్షణం ఏమిటి?

మంజుల: నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇది మంచి లక్షణం. మిగతా అన్ని విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని నా అభిప్రాయం. దేన్ని సీరియస్‌గా తీసుకోరు.

జరిగేది జరుగుతుందిలే అనేది మీ ఉద్దేశమా?

నిరుపమ్‌: నేను దేని గురించి ఎక్కువగా ఆలోచించను. ఓ వారంలో మంజు పుట్టినరోజు వస్తుందనుకోండి.. ఆరోజు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోవాలన్నది ఆమె కోరిక. నేనేమో షూటింగ్‌లతో బిజీ. అది మంజు చాలా పెద్ద తప్పు కింద చూస్తుంది. (మధ్యలో మంజు కల్పించుకుంటూ ‘ఒక సంవత్సరం అయితే సర్లే అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కుదరలేదా? ఒకే వృత్తిలో ఉన్నప్పుడు ఇలాంటివి చిన్నచిన్న సమస్యలు వస్తాయని కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నా)

మీ ఇద్దరికి సంబంధించిన కొన్ని కంప్లైంట్స్ మా దగ్గరకొచ్చాయి. వాటిని ఇక్కడే తేల్చేయాలి. మీరు షూటింగ్‌ వెళ్లేటప్పుడు బట్టలన్నీ బయటపడేసి వెళ్లిపోతారట? ఇంట్లో ఏ పనిలోనూ సహాయం చేయరట?

నిరుపమ్‌: పనికి వెళ్లే హడావుడిలో బ్యాగులో ఉన్న బట్టలు తీసేసి, అక్కడున్నవి మళ్లీ బ్యాగ్‌లో సర్దుకొని వెళ్లిపోతాను. ‘వాళ్లే చేసుకుంటారులే. ఎవరి కోసం చేస్తారులే’ అనే భావన నాకు లేదు. మీరు దయచేసి ఉద్యమాలు లేపకండి. (మధ్యలో మంజుల కల్పించుకుంటూ అడగనిదే ఏదీ చేయరు. అడిగితే చేస్తారు)

మేకప్‌ స్టార్ట్‌ చేస్తే రెండు మూడు ఎపిసోడ్స్ అయిపోతాయట? అన్నీ నెగెటివ్‌గా ఆలోచిస్తారట?

మంజుల: మేకప్‌ ఆన్‌ స్ర్కీన్‌పైనే వేసుకుంటా. ఆఫ్‌ స్ర్కీన్‌లో వేసుకోను. ఏదైనా విషయం ఉంటే నేను పాజిటివ్‌, నెగెటివ్‌ రెండు విధాలుగా ఆలోచన చేస్తా. కానీ, నిరుపమ్‌ ఎప్పుడు పాజిటివ్‌గానే ఆలోచిస్తారు. నాకు అది నచ్చదు.

కాలేజీలో తల్లిదండ్రులను తీసుకురమ్మంటే ఇంటి ఓనర్‌ను తీసుకెళ్లారట?

నిరుపమ్‌: దీపావళి ముందురోజు వార్డెన్‌ రూం ముందు టపాసులు పెట్టి తలుకొట్టాం. ఆయన తలుపు తీసుకొని రాగానే టపా టపా పేలాయి. అది ఎవరు చేశారో మా హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌కి తెలిసింది. దాంతో వాళ్లు మా అమ్మానాన్నలని తీసుకురమ్మన్నారు. నాకు ఇంట్లో వాళ్లకి చెప్పేంత ధైర్యం లేదు. చాలా ఆలోచించా చివరకు మా స్నేహితుడి ఇంటి ఓనర్లని తీసుకెళ్లి అమ్మానాన్నలుగా పరిచయం చేసి గండం నుంచి బయటపడ్డా.

మీ అమ్మ నుంచి ఎలాంటి సపోర్టు ఉంటుంది?

నిరుపమ్‌: నేను సినిమాల్లోకి వెళ్లడం ఆమెకు మొదటి నుంచీ ఇష్టం లేదు. ‘ఫిటింగ్‌ మాస్టర్‌’లో నేను నెగెటివ్‌ క్యారక్టర్‌ చేశా. అందులో కొన్ని చోట్ల తన్నులు తినే సన్నివేశాలు ఉన్నాయి. ఇవన్నీ అమ్మ చూసి ‘ఎందుకురా ఇంత చదువుకుని తన్నించుకోవడం ఏంటి, అవసరమా’ అని అడిగింది.

మీ ఇద్దరిలో గొడవ పడితే ఎవరు ముందు రాజీకొస్తారు?

నిరుపమ్‌ - మంజుల: ఇది అందరికీ తెలిసిన విషయమే. భర్తే రాజీపడతారు. అణచివేతకు మగబతుకు బలవుతూనే ఉంది. ఆడవాళ్లు చేసేవి లెక్కబెట్టవచ్చు. కానీ మేం చేసేవి లెక్కలేనన్ని.

త్వరలో పరిటాల నిరుపమ్‌ కథ, మాటలు, రచన తెరపై చూడవచ్చా?

నిరుపమ్‌: డైలాగ్స్ రాయాలనే పెద్దగా కోరిక లేదు. ఓ నటుడిగా నాకు నటనపైనే దృష్టి ఎక్కువ. మధ్యలో స్క్రిప్ట్‌ నచ్చి ఓ సినిమాకు డైలాగ్స్ రాయమన్నారు. రాశా. ఇప్పుడు కూడా సీరియల్స్‌కు అవసరం ఉంటే రాస్తున్నా. వెబ్‌సిరీస్‌ వైపు వెళ్లాలని ఉంది.

ఈ వేదిక ద్వారా మీ ఆవిడకు కాకుండా ఇంకా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు?

నిరుపమ్‌: మా అమ్మకు. నా చిన్నప్పటి నుంచి అమ్మతోనే ఎక్కువగా ఉండేవాడిని. నా జీవితంలో ప్రతి సందర్భం, మలుపులోనూ ఆమె నాకు అండగా నిలిచింది. అమ్మ లేకపోతే నేను లేను.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts