Suhas: ఆయన ఇచ్చిన రూ.500 నోటు పట్టుకుని మూడు గంటలు ఏడ్చా: సుహాస్‌

color photo: ఇటీవల జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ‘కలర్‌ఫోటో’ హీరో సుహాస్‌, దర్శకుడు సందీప్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు..

Updated : 03 Aug 2022 10:09 IST

వాళ్లిద్దరూ ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. వాళ్లు ప్రయాణం ప్రారంభించినప్పుడు అందరూ గేలి చేసినవాళ్లే. లఘుచిత్రాలతో తామేంటో నిరూపించుకున్నా ఏదో వెలితి. తీస్తే గట్టిగా తీయాలని నిర్ణయించుకున్నారు. ‘కలర్‌ ఫోటో’ను ప్రేక్షకులకు చూపించి మెప్పించారు. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు సాధించి మన ముందు ఘనంగా నిలిచారు. వారే ‘కలర్‌ ఫోటో’(Colour Photo) హీరో సుహాస్ (Hero Suhas), దర్శకుడు సందీప్‌రాజ్‌ (Sandeep Raj). సినీ ప్రయాణంలో తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకోవటానికి ‘ఆలీతో సరదాగా’(Alitho saradaga) కార్యక్రమానికి విచ్చేశారు. మరి వీరిద్దరు చెప్పిన కబుర్లేంటో చూసేద్దామా..!

తొలి ప్రయత్నంతోనే జాతీయస్థాయి విజయం అందుకున్నారు? ఈ విజయం వెనుక ఎన్నేళ్ల కష్టం ఉంది?

సందీప్‌ రాజ్‌: 2015లో హైదరాబాద్‌లో అడుగుపెట్టా. సుహాస్‌ అప్పటికే ఆర్టిస్టుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. నేనూ రైటర్‌ లేదా విలన్‌ అవుదామనే ఆలోచనతో అతన్ని కలిశా. మాట్లాడిన పది నిమిషాలకే ‘నువ్వు నా హీరోవి, నేను నీ డైరెక్టర్‌ని’ అన్నా. ఇద్దరం మొదట్లో కామెడీ మీమ్స్‌ వేసేవాళ్లం. ఆ తరువాత ‘చాయ్‌ బిస్కెట్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి అందులో మేము నటించిన అయిదు నిమిషాల కామెడీ వీడియోస్‌ని అప్‌లోడ్‌ చేసేవాళ్లం. అయితే 2017లో మేము తీసిన ‘ది అతిథి’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ మాకు గుర్తింపు తెచ్చింది. ఆ పది నిమిషాల షార్ట్‌ఫిల్మ్‌ని చూసి, చాలా మంది సెలెబ్రిటీస్‌ ప్రశంసించారు. సుహాస్‌కి సినిమాల్లో నటించే అవకాశం దొరికింది. నాకూ రైటర్‌గా అవకాశం లభించింది. కానీ, మనమే పెద్ద సినిమా చేయాలని ఇద్దరం నిశ్చయించుకున్నాక పుట్టిందే ‘కలర్‌ఫోటో’ కథ.

అసలు మీ ఇద్దరిది ఏ ఊరు? మీ నేపథ్యమేంటి?

సుహాస్‌: మా ఇద్దరిదీ విజయవాడే. ఇంకో విశేషం ఏంటంటే మేమిద్దరం ఒకే ఏరియాకి చెందినవాళ్లం. మా ఇంటికి, వీళ్లింటికి మధ్యలో ఒక వీధి ఉంటుంది. అయితే ఆ విషయం మాకిక్కడికొచ్చాకే తెలిసింది. హైదరాబాద్‌ వచ్చాకే మా పరిచయం జరిగింది. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. సందీప్‌ ఇంజినీరింగ్‌ కంప్లీట్ చేశాడు. ఇంకా మా ఇద్దరి ఆలోచనలు ఒకటే కావటంతో కలిసి ప్రయాణం ప్రారంభించాం. ‘చాయ్‌ బిస్కెట్‌’ యూట్యూబ్‌ ఛానల్‌ మా టాలెంట్‌ని నిరూపించుకోవటానికి బాగా ఉపయోగపడింది. 

జాతీయ అవార్డు వచ్చినపుడు మీ స్పందన ఏంటి? మీ ఇద్దరిలో ఎవరికి ముందు తెలిసింది?

సుహాస్‌: వీడికే (సందీప్‌ రాజ్‌).. నా ఫోన్‌లో అస్సలు ఛార్జింగ్‌ లేదు. వీడు ఫోన్‌ చేసి ‘రేయ్‌ కలర్‌ ఫోటోకి నేషనల్‌ అవార్డ్‌ వచ్చిందిరా’ అని అరిస్తే ప్రాంక్‌ అనుకుని చిరాకు పడ్డా. కానీ నిజమని తెలిసి ఆఫీస్‌కి వెళ్లేసరికి  ‘కలర్‌ ఫొటో’ టీమ్‌ అంతా అరుస్తూ, ఏడుస్తూ ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. ఆ రోజుని మర్చిపోలేను.

సందీప్‌ రాజ్‌: నిజానికి ఆరోజు సూర్యగారికి అవార్డు వస్తోందని తెలిసి టీవీ చూస్తున్నా. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఇన్‌ తెలుగు ‘కలర్‌ ఫోటో’ అనగానే నేను షాక్‌ అయిపోయా. నా పేరు వినబడగానే గట్టిగా అరిచా. ఇక నాకు వరుసగా ఫోన్‌లు. ఆ రోజు వచ్చినన్ని ఫోన్‌లు నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. చాలామంది పెద్దలు ఫోన్‌ చేసి అభినందించారు.

ఈ సినిమాకి పడ్డ కష్టమేంటి?‘కలర్‌ఫోటో’ అనుభవాలు జీవిత పాఠాలను నేర్పించాయా?

సందీప్‌ రాజ్‌: ‘కలర్‌ఫోటో’ స్క్రిప్టుని దాదాపు 90మందికి పైగా ప్రొడ్యూసర్లకు వినిపించా. కథ బాగుంది అనేవారు. కానీ ‘కాస్టింగ్‌ మార్చు, స్టోరీ లైన్‌ మార్చు’ అని సలహాలు ఇచ్చేవారు. ఒక ప్రొడ్యూసర్‌ రాహుల్‌ రామకృష్ణని హీరోగా పెట్టి తీద్దామన్నారు. మరొకరు ‘చాందిని’ ఈ పాత్రకు సెట్‌ అవ్వదు అని తేల్చేశారు. ఏమైనా సరే నా స్టోరీని, నా కాస్టింగ్‌ని మార్చే ప్రసక్తే లేదని పంతంతో సినిమా తీశా. ఇందులో పనిచేసిన నటీనటులతో పాటు టెక్నీషియన్లంతా ‘చాయ్ బిస్కెట్‌’ షార్ట్‌ ఫిల్మ్స్‌కి పనిచేసిన వారే.

సుహాస్‌: అసలు నేను ‘కలర్‌ ఫోటో’లో హీరోని అని ఎక్కడా చెప్పుకోలేదు. ఎందుకంటే నేను హీరో ఫ్రెండ్‌గా, కమెడియన్‌గా నటిద్దామని ఇండస్ట్రీకి వచ్చా. ఇప్పుడు హీరో అని చెప్పాకా, ఎవరైనా కామెంట్‌ చేస్తే ఈ రోల్‌లో నటించేటప్పుడు డిస్టర్బ్‌ అవుతానని చెప్పేవాడిని కాదు. హీరోయన్‌ ఓరియెంటెడ్‌ అని, సునీల్‌ మెయిన్‌ రోల్‌ అని చెప్పేవాడిని.

మీరు షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసేటప్పుడు ఇంత సక్సెస్‌ సాధిస్తామని ఊహించారా?

సుహాస్‌: నేనైతే అస్సలు ఊహించలేదు. ఎందుకంటే చిన్న రోల్స్‌ దొరికితే చాలు అనుకునేవాడిని. ఇప్పుడు ఆరు సినిమాల్లో హీరోగా నటిస్తున్నా. దీనంతటికి కారణం ‘కలర్‌ఫోటో’ ఇచ్చిన విజయం.

సందీప్‌ రాజ్‌: మొదట్లో ‘చాయ్‌ బిస్కెట్‌’ పేరులో కామెడీ షార్ట్‌ వీడియోస్‌ తీసి విడుదల చేసినప్పుడు చాలా మందికి నచ్చేవి. అయితే వీడియో కింద కొందరు తిడుతూ కూడా కామెంట్లు పెట్టేవారు. చివరికి షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసుకునేవాళ్లు కూడా కామెడీ చేసేస్తున్నారు అని కొన్ని కామెంట్లు మమ్మల్ని ఆలోచించేలా చేశాయి. కామెడీ చేయడం కూడా కామెడీ అయిపోయిందనుకున్నాం. ఎలాగైనా మంచి షార్ట్‌ ఫిల్మ్ చేద్దాం అని ‘ది అతిథి’ తీశాం. దానిని అందరూ ప్రశంసించారు. ఈ ప్రయత్నాలను పెంచి పెద్దగా తీసిన చిత్రమే ‘కలర్‌ఫోటో’.

ఇండస్ట్రీలో మీకు ఎదురైన చేదు అనుభవాలు ఏంటి?అవకాశాల కోసం ప్రయత్నించి నిరాశ చెందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

సుహాస్‌: 2016లో జరిగిన ఒక సంఘటన.. అప్పటికి నాకెటువంటి అవకాశాలు రాలేదు. డబ్బులకి చాలా ఇబ్బంది పడుతున్న సమయమది. ఎవరిని అడగాలో తెలియక మా అన్నయ్య ఫ్రెండ్‌ ఒకాయన దగ్గరికి వెళ్లా. ఆయన్ని అడగడానికి మొహమాటపడ్డాను. ఆయన నా అవస్థని గమనించి ఒక అయిదు వందల రూపాయల నోటు జేబులో పెట్టి ‘ఉంచరా’ అని వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆ నోటుని చూస్తూ మూడు గంటలు ఏడ్చాను. ఇలా చాలా సార్లు ఆర్థికంగా ఇబ్బందిపడిన సందర్భాలు ఉన్నాయి.

సందీప్‌ రాజ్‌: ఎప్పుడూ మా సొంత ప్రయత్నాలు మేము చేసేవాళ్లం. అయితే మా షార్ట్‌ఫిల్మ్‌ ‘ది అతిథి’ హిట్టయ్యాక మెల్లమెల్లగా అవకాశాలు రావటం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఒక అసిస్టెంట్‌ రైటర్‌ నాకు ఒక స్క్రిప్టు ఇచ్చి దాన్ని మెరుగుపరచమన్నారు. అప్పుడు నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోజులు. నాకు ఎంత రెమ్యూనరేషన్‌ అడగాలో కూడా తెలియదు. నాకు అయిదువేలు అవసరం అయ్యి అంతే అడిగాను. అతను ఓ నవ్వు నవ్వి అయిదు వేలేంటి? నీకెంత కావాలంటే అంత తీసుకో అన్నాడు. స్క్రిప్టు రాసిచ్చాక నా నంబరు బ్లాక్‌లో పెట్టాడు. నేను చాలా తక్కువ అడగడమే కారణమని తరువాత తెలిసి ఆశ్చర్యపోయా. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో అప్పుడు నాకర్థమయ్యింది. ఇంకా ‘కలర్‌ఫోటో’ కథను చర్చించేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను.

‘కలర్‌ఫోటో’లో మీ నిజజీవిత అనుభవాలను చేర్చిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా?

సుహాస్‌: ‘కలర్‌’ సార్‌. నిజానికి ఆ పాయింట్‌ ని ప్రధానాంశంగా చూపించడం నాకు బాగా నచ్చింది. నిజజీవితంలో చాలా సందర్భాల్లో నాకు ఎదురైన అనుభవాల సారాంశాన్ని చూపించారు. ఒక సినిమాలో క్యారెక్టర్‌ ఉందని చెప్తే వెళ్లాను. అక్కడికి వెళ్లాక ‘ఇలా వచ్చావేంటి తమ్ముడూ’ అని ఆ సినిమా డైరెక్టర్‌ అడిగాడు. ‘ఏదో రోల్‌ ఉందన్నారు అన్నా’ అంటే అది ‘నీకు సూటవ్వదు’ అని పంపించేశాడు. ఆ తరువాత నాకు అసలు విషయం తెలిసింది. ఇలా చిన్నప్పట్నుంచి మా ఇద్దరి అనుభవవంలో ఉన్న సమస్యను సినిమాలో పెట్టాము.

సందీప్‌ రాజ్‌: నన్ను చిన్నప్పుడు క్లాస్‌లో నైజీరియన్‌ అని పిలిచేవారు. ఏ విషయంలో కామెంట్‌ చేసిన నా నుంచి కౌంటర్‌ ఉండేది కానీ, ‘కలర్‌’ విషయంలో ఏం మాట్లాడాలో చిన్నతనంలో అర్థం అయ్యేది కాదు. అలా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యనే సినిమాలో సమర్థంగా చూపించాం.

కలర్‌ఫోటో సక్సెస్‌ తరువాత జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? మీ తల్లిదండ్రుల స్పందన ఏంటి?

సుహాస్‌: మా నాన్నగారు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌. చిన్నప్పట్నుంచి స్ట్రిక్ట్‌ గానే ఉండేవారు కానీ, నా ప్రయత్నాలను ఎప్పుడూ వారించలేదు. కలర్‌ఫోటో షూటింగ్‌కి కూడా వచ్చారు. సినిమా చూసిన వెంటనే ఫోన్‌ చేసి అభినందించారు కూడా.

సందీప్‌ రాజ్‌:  ఆయన సినిమా చూసిన వెంటనే ‘చాలా బాగుంది. నేషనల్‌ అవార్డు వస్తుంది’ అని అప్పుడన్నారు. ఆయన మాటే మాకప్పుడు నేషనల్‌ అవార్డులా అనిపించింది. కానీ నిజంగా నేషనల్‌ అవార్డు రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాం.

మరి తరువాతి సినిమాల పరిస్థితి ఏంటి? హీరోగా కొనసాగనున్నారా?

సుహాస్‌: హీరోగా కొన్ని సినిమాలు ఒకే చేశాను. ప్రత్యేకంగా హీరో అని ఏమీ లేదు. పాత్ర నచ్చితే ఏదైనా చేస్తా. నాకు మంచి నటుడిగా నిరూపించుకోవడమే కావాల్సింది.

సందీప్‌ రాజ్‌: కొన్ని కథలు సిద్ధం చేశా. జాగ్రత్తగా అడుగులు వేయాలనుకుంటున్నాను. దర్శకుడిగా నాకు రాజమౌళి అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలే నాకు స్ఫూర్తి. ఇంకా విలన్‌గా నటించాలనే నా కోరిక భవిష్యత్‌లో తీర్చుకుంటానని ఆశిస్తున్నా.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts