Allari Naresh: ఆ నాలుగు రోజుల్లో 500కిపైగా సిగరెట్లు కాల్చా: అల్లరి నరేశ్‌

సూపర్‌ హిట్‌ చిత్రం ‘నాంది’ తర్వాత హీరో అల్లరి నరేశ్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన ‘ఉగ్రం’ మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నరేశ్‌ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Published : 28 Apr 2023 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు అనుకున్న విధంగా సన్నివేశం పండేందుకు నటులు టేక్‌ మీద టేక్‌ తీసుకుంటుంటారు. ఔట్‌పుట్‌ అద్భుతంగా వచ్చేందుకు ఎన్నో కష్టాలను భరిస్తారు. తన తాజా చిత్రం ‘ఉగ్రం’ (Ugram) విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు హీరో అల్లరి నరేశ్‌ (Allari Naresh). ప్రమోషన్స్‌లో భాగంగా సాంకేతిక బృందంతో చర్చిస్తూ ఆ విషయాన్ని ఆయన బయపెట్టారు. ఈ సినిమాలో అడవి నేపథ్యంలో సాగే పోరాట సన్నివేశం కీలకమని, సుమారు నాలుగు రోజుల్లో చిత్రీకరణ జరిగిన దానికోసం 500కిపైగా సిగరెట్లు కాల్చానని చెప్పారు. విజువల్‌ ట్రీట్‌ కోసం అడవిలో ‘స్మోక్‌’ ఎఫెక్ట్‌ వాడారని, ఆ పొగలో నటించడం కష్టంగా అనిపించిందని, పైగా సిగరెట్‌ తాగుతూ నడుచుకుంటూ రావాలని దర్శకుడు చెప్పారని (నవ్వులు) చిత్రీకరణ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. విపరీతంగా ధూమపానం చేయడం వల్ల దగ్గు, జ్వరం వచ్చాయన్నారు. ‘ఉగ్రం’లోని ఓ లుక్‌ గతంలో తాను నటించిన ‘నేను’లోని లుక్‌ను తలపిస్తుందని అభిమానులు అంటున్నట్టు పేర్కొన్నారు.

దర్శకుడు విజయ్‌ కనకమేడల మాట్లాడుతూ.. ‘‘హీరో పాత్ర శివకుమార్‌ను దృష్టిలో పెట్టుకుని ఉగ్రం టైటిల్‌ను ఎంపిక చేశాం. హీరో ఉగ్రరూపంలో ఉంటాడు. ‘నాంది’ చిత్రీకరణ సమయంలోనే ‘ఉగ్రం’ ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు నరేశ్‌ని ఏ దర్శకుడు చూపించని కోణంలో చూపించాలనే ఈ సినిమాకి ఆయన్ను తీసుకున్నా’’ అని వివరించారు. సూపర్‌ హిట్‌ ‘నాంది’ (Naandhi) తర్వాత విజయ్‌- నరేశ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రంకావడంతో ‘ఉగ్రం’ (Ugram on May 5th)పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు మరింత ఆసక్తిని పెంచాయి. నరేశ్‌ నటించిన 60వ చిత్రమిది. మిర్నా మేనన్‌ కథానాయిక. వాస్తవ సంఘటనల ఆధారంగా మిస్సింగ్‌ కేసుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నరేశ్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించునున్నారు. ఈ సినిమా మే 5 (Ugram Release Date)న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని