Anushka Shetty: అన్ని కోట్లా?.. అనుష్కపై రిస్క్‌ ఎందుకన్నారు.. కానీ

అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. తన కెరీర్‌ గురించి అనుష్క పంచుకున్న కొన్ని విశేషాలివీ..

Updated : 07 Nov 2022 12:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాపై అవగాహనలేని ఓ యోగా టీచర్‌.. అనుకోకుండా నటి అయ్యారు. తొలినాళ్లలో భయమేసినా వెనక్కి తగ్గకుండా ముందడుగేశారు. అలా ఒక్కో మెట్టూ ఎక్కుతున్న సమయంలోనే ‘అరుంధతి’ అనే అరుదైన అవకాశం అందుకున్నారు. నాయికా ప్రాధాన్య చిత్రాలకు కొత్త ఊపిరి పోశారు. ఎంతోమంది కథానాయికలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆమె ఎవరో..! ‘సాషా’గా పరిచయమై ‘సూపర్‌’ హీరోయిన్‌ అని అందరితోనూ అనిపించుకున్న అనుష్క పుట్టినరోజు (1981 నవంబరు 7) నేడు. ఈ సందర్భంగా అనుష్క (Anushka) పలు సందర్భాల్లో పంచుకున్న కొన్ని విశేషాలు చూద్దాం..

చేయాల్సింది ఇంకా ఉంది..

‘‘నటిగా నా కెరీర్‌కు సుమారు 17 ఏళ్లు. చాలామంది దీన్ని పెద్ద ప్రయాణంగా భావిస్తారు. కానీ, అది చాలా చిన్నది. బాగా కష్టపడితే కథానాయికలూ పరిశ్రమలో ఎక్కువ కాలం రాణించగలరు. ఆ నమ్మకంతోనే నా ప్రతీ అడుగూ వేశా, వేస్తున్నా. చాలామందిలానే నేనూ అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చా. నాకు సినిమాలపై కనీస అవగాహన లేదు. తొలిసారి కెమెరాను ఫేస్‌ చేసినప్పుడు భయమేసింది. ఆ సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఎలా చెబితే అలా నటించా. ‘సూపర్’ సినిమా చిత్రీకరణలో నేను చేసిన తప్పులను విశ్లేషించుకుని, తర్వాతి చిత్రాల్లో వాటిని పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డా’’ (Happy Birthday Anushka)


తొలిస్థానం అరుంధతిదే

‘‘ఆ హీరోతో కలిసి నటించాలి.. ఈ పాత్రను పోషించాలి’ అని నేనెప్పుడూ ఓ జాబితా రాసుకోలేదు. మంచి కథల్లో నటించాలని మాత్రమే అనుకునేదాన్ని. నేనెన్ని సినిమాల్లో నటించినా ‘అరుంధతి’ (Arundhati)నే నంబరు వన్‌. ఏ నటికైనా ఇలాంటి పాత్ర పోషించడం ఓ సవాలు. నేనే కాదు ఈ సినిమాలో ఎవరు నటించినా అద్భుతంగానే ఉండేది. వేరే హీరోయిన్‌ నటించాల్సిన ఈ పాత్ర చివరిలో నాకు దక్కింది. ‘‘ఇన్ని కోట్ల రూపాయల బడ్జెట్‌తో నాయికా ప్రాధాన్య సినిమా తీస్తారా? అనుష్కపై అంత రిస్క్‌ చేయడం ఎందుకు?’’ అని చాలామంది వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. కానీ, నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి ఇవేం పట్టించుకోకుండా నాపై నమ్మకంతో ‘అరుంధతి’ని నిర్మించారు’’ (Happy Birthday Sweety)


కన్‌ఫ్యూజన్‌లో..

‘‘అరుంధతి’ సూపర్‌హిట్‌కావడంతో ఆ తర్వాత ఎలాంటి సినిమాల్లో నటించాలో? అనే కన్‌ఫ్యూజన్‌ ఉండేది. ఆ సందేహంలోనే ‘బిల్లా’ (Billa) చిత్రం చేశా. అరుంధతి/ జేజమ్మలాంటి హుందా పాత్రలు పోషించిన వెంటనే ‘బిల్లా’లో గ్లామర్‌ రోల్‌లో కనిపించడం సాహసమే. ఆ చిత్రంలోనే తొలిసారి బికినీలో కనిపించా. నా జీవితంలో ఇబ్బందికర క్షణాలు అవే’’


చదువు చెప్పా..

‘‘నా అసలు పేరు స్వీటీ అని, నేను యోగా టీచర్‌గా పనిచేశానని మీలో చాలామందికి తెలుసు. కానీ, ఓ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పాననే విషయం తెలియకపోవచ్చు. బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పట్టా పొందిన తర్వాత కొన్నాళ్లు టీచర్‌గా మారా. తర్వాత యోగాను కెరీర్‌గా ఎంచుకుంటానంటే కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. చివరకు నాకు నచ్చిందే చేయమన్నారు. అలా నా పని నేను చేసుకుంటుంటే 2005లో ‘సూపర్‌’కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నుంచి పిలుపు వచ్చింది’’


ఇతరులను అనుకరించొద్దు

‘‘చాలామంది అమ్మాయిలు ‘నేను అనుష్కలా’ ఉండాలి అని, కొందరు అబ్బాయిలు ‘నేను ఫలానా హీరోలా అయితే బాగుండు’ అని ఫీలవుతుంటారు. ఈ విషయంలో వారికి నాదో సలహా.. మీరు ఎవరినీ అనుకరించొద్దు. ఎవరి వ్యక్తిత్వం వారిది.. ఎవరి ప్రతిభ వారిది. మీరు ఏ రంగంలోకి వెళ్లినా, వెళ్లాలనుకుంటున్నా ఆయా ఇండస్ట్రీల్లోని వారితో పోల్చుకోవద్దు. ఎవరూ ఎవరికన్నా గొప్పకాదు. అందరూ సమానమే’’


అయినా ఆయన ప్రోత్సహించారు..

‘‘స్కూల్‌, కాలేజీల్లో నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అతికొద్దిమంది స్నేహితులే ఉండేవారు. అలా అని చదువులో నేను టాపర్‌ని కాదు. అయినా మా ప్రిన్సిపల్‌ నన్ను బాగా ప్రోత్సహించేవారు. సొంత కూతురిలా చూసుకునేవారు. ‘మనం ఎలా ఉన్నా కొందరు మన వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు’ అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది’’ అని అనుష్క తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.


అటు అందం.. ఇటు అభినయం

తనకు నటనపై ఆసక్తి లేకపోయినా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క కెరీర్‌ ఎందరో నటులకు స్ఫూర్తి. ‘విక్రమార్కుడు’, ‘లక్ష్యం’, ‘మిర్చి’ తదితర కమర్షియల్‌ చిత్రాల్లో అందగా కనిపించిన అనుష్క.. ‘వేదం’, ‘పంచాక్షరి’, ‘నాగవల్లి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్‌ జీరో’ వంటి సాహసోపేతమైన పాత్రలతో మరింతగా మెప్పించారు. తాను ఎంత కష్టపడైనా అనుష్క పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేస్తారన్న దానికి ‘సైజ్‌ జీరో’ ఓ ఉదాహరణ. బొద్దుగా ఉండేవారు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో సౌందర్య అనే పాత్రతో కళ్లకు కట్టినట్టి చూపించారు. ‘నంది’ పురస్కారం సహా పలు అవార్డులు అందుకున్న స్వీటీ 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ చిత్రం తర్వాత మరోసారి తెరపై కనిపించలేదు. ఆమె ప్రస్తుతం ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. అందులో ‘జాతిరత్నాలు’ ఫేం నవీన్‌ శెట్టి హీరో. ‘రారా కృష్ణయ్య’ ఫేం మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


స్వీటీ చెప్పిన మరికొన్ని ముచ్చట్లు

పారిపోయాడు: నేను ఎత్తుగా, సీరియస్‌గా ఉండటంతో నా వెంటపడేందుకు అబ్బాయిలు సాహసం చేసేవారు కాదు. కానీ, ఓసారి ఓ కుర్రాడు నాకు ప్రపోజ్‌ చేశాడు. ‘మా నాన్న దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పు’ అని అనగానే అక్కడి నుంచి పారిపోయాడు. కాలేజీ రోజుల్లోని ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను.

తప్పకుండా చెబుతా: రిలేషన్‌షిప్‌, పెళ్లికి నేను వ్యతిరేకం కాదు. క్రికెటర్‌తో డేటింగ్‌ చేస్తున్నానని, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో ప్రేమలో ఉన్నాననీ వార్తల్లో చూశా. ఒకవేళ నేను ప్రేమలో పడితే దాచుకోను. అన్ని విషయాల్లానే దాని గురించీ తప్పకుండా చెబుతా.

నిజాయతీగా ఉండాలి: ఫలానా లక్షణాలున్న వాడినే పెళ్లి చేసుకోవాలనేం లేదు. కాబోయేవాడు నిజాయతీగా ఉంటే చాలు.

హాబీస్‌: ప్రయాణాలు చేయడం బాగా ఇష్టం. మూగజీవాలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటా.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని