AR Rahman: ఏఐతో పాట.. ‘లాల్‌ సలాం’లో మేజిక్‌ చేయనున్న ఏఆర్‌ రెహమాన్‌..

‘లాల్‌ సలాం’లో ఒక పాట కోసం కృత్రిమ మేధను ఉపయోగించినట్లు సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ వెల్లడించారు.

Updated : 30 Jan 2024 13:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన సంగీతంతో సినీ ప్రియులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు ఏ.ఆర్‌.రెహమాన్‌ (AR Rahman). ఇప్పుడాయన కొత్త ట్రెండ్‌ను సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లాల్‌ సలాం’. అందులో కృత్రిమ మేధ (Artificial Intelligence)ను ఉపయోగించి ఇద్దరు దివంగత గాయకుల గొంతును వినిపించనున్నారు.

దివంగత గాయకులు బాంబా బక్యా, షాహుల్‌హమీద్‌ల వాయిస్‌లను రీ క్రియేట్‌ చేసి ‘లాల్‌ సలాం’లో ‘తిమిరి ఎలుదా..’ అనే పాటను రూపొందించినట్లు ఏఆర్‌ రెహమాన్‌ వెల్లడించారు. ‘గాయకుల వాయిస్‌ అల్గారిథమ్స్‌ను ఉపయోగించుకొనేందుకు వారి కుటుంబసభ్యుల అనుమతి తీసుకున్నాం. దీనికోసం వారికి పారితోషికాన్ని అందించాం. సాంకేతికతను సరైన విధానంలో ఉపయోగిస్తే ముప్పు ఉండదు’ అని ఆయన పోస్ట్‌ పెట్టారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి ప్రయోగం తొలిసారి అని నిర్మాణసంస్థ తెలిపింది. ఈ పోస్ట్‌ వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు దీన్ని ప్రశంసిస్తుండగా.. ఇలా చేయడం అనైతికమంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?

‘లాల్‌ సలాం’ విషయానికొస్తే.. క్రికెట్‌ చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించగా.. రజనీకాంత్‌ కీలక పాత్ర పోషించారు. దీన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని