Balakrishna: అంతా ఓపెన్‌ బుక్‌.. ఎవరికీ భయపడేదే లేదు.. ‘విగ్గు’ కామెంట్‌పై బాలకృష్ణ

బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. సినిమాని ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్‌మీట్‌లో పాల్గొంది.

Published : 15 Oct 2023 18:43 IST

హైదరాబాద్‌: విగ్గు పెట్టుకుంటాడంటూ ఒకాయన తనపై కామెంట్‌ చేశాడని బాలకృష్ణ (Nandamuri Balakrishna) పేర్కొన్నారు. తిరిగి తానూ సదరు వ్యక్తిని పశ్నించానని, తాను ఎవరికీ భయపడనని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తన కొత్త చిత్రం ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) ప్రెస్‌మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 19 ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘జెర్సీ’ ఫెయిల్యూర్‌ అంటూ విలేకరి ప్రశ్న.. నాని అసహనం

బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘దేవాలయంలో మనం చేసే ప్రదక్షిణలు, దైవ నామస్మరణ 108తో ముడిపడి ఉంటాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నా 108వ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ సినిమా కూడా ఆ నేపథ్యంలో రూపొందిందే. ఈ చిత్రం పవర్‌తో కూడుకున్నది. అనిల్‌ రావిపూడి విభిన్న చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. సినిమా సినిమాకూ సంబంధం ఉండదు. ఇండస్ట్రీకి ఆయన ఓ వరం అని నేను భావిస్తున్నా. ఆయన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. మేమిద్దరం ఈ చిత్రాన్ని సవాలుగా తీసుకున్నాం. గెటప్‌, యాస తదితర అంశాల్లో రీసెర్చ్‌ చేశాం. పోటీ ఉంటేనే ఏ రంగంలోనైనా మంచి ఫలితాలు వస్తాయి. మాకు మేమే పోటీ. నాకు ఎవరూ పోటీ కాదు. నేను ఎవరినీ పట్టించుకోను. నా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తా. ప్రస్తుతం ప్రచార చిత్రాల్లో మీరు చూస్తున్న పాత్రతో పాటు, ఇంకో పాత్ర కూడా ఉంది. అది చెబితే లీక్‌ చేసినట్టే. స్క్రీన్‌పైనే చూడండి’’

ప్రేక్షకులు చప్పట్లు కొట్టాల్సిందే!

‘‘తమన్‌ అందించిన సంగీతం అద్భుతం. స్టార్‌ హీరోయిన్లుగా కాజల్‌ ఎన్నో ఏళ్లు ఇండస్ట్రీని ఏలింది. వివాహానంతరం కాస్త విరామం తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలోని కాత్యాయని పాత్రలో నటించేందుకు అంగీకరించిన ఆమెకు టీమ్‌ తరఫున కృతజ్ఞతలు. శ్రీలీల గొప్ప నటి అవుతుంది. ఎమోషనల్‌ సీన్స్‌లో మేమిద్దరం గ్లిజరిన్‌ లేకుండా నటించాం. ప్రతి ఒక్కరూ కంటతడితోనే థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. ప్రతి సన్నివేశానికి ప్రేక్షకులు నిల్చొని చప్పట్లు కొట్టాల్సిందే. జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌కి ఇది తొలి తెలుగు సినిమా. తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పడం విశేషం’’ అని అన్నారు. 

నాటి సంగతులు గుర్తుచేసుకుంటూ.. ‘‘సినిమాటోగ్రాఫర్‌ రామ్‌ప్రసాద్‌ నాకు ఎప్పటి నుంచో తెలుసు. మేమంతా కలిసి భోజనం చేసేవాళ్లం. అప్పట్లో కారవాన్‌లు లేవు. చాప, దిండు వేసుకుని నేలపైనే పడుకునేవాళ్లం. ఆ సమయంలో విగ్గు తీసేవాణ్ని. ‘ఈయన విగ్గు పెట్టుకుంటాడు’ అంటూ ఇటీవల ఒకాయన ఎగతాళిగా మాట్లాడాడు. అవునయ్యా విగ్గు పెట్టుకుంటా.. నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగా. మనదంతా ఓపెన్‌ బుక్‌. ఎవరికీ భయపడేదే లేదు’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని