Avika Gor: ఆ ఫోన్‌ కాల్స్‌తో నేను ఎంతో బాధపడ్డా: అవికాగోర్‌

‘చిన్నారి పెళ్లికూతురు’, ‘ఉయ్యాలా జంపాలా’తో తెలుగు సినీ ప్రియులకు చేరువైన బ్యూటీ అవికాగోర్‌ (Avikagor). ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆమె చిత్ర రంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకొన్నారు. 

Published : 15 Jun 2023 16:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అడపాదడపా సినిమాల్లో నటిస్తూ విజయం కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు నటి అవికాగోర్‌ (Avika Gor). ఆమె ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’ (1920 Horrors of the Heart). హారర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే అవికాగోర్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌, రెండు ఫోన్‌ కాల్స్‌ గురించి చెప్పారు. ఆ రెండు కాల్స్‌ తనని ఎంతో బాధపెట్టాయని వెల్లడించారు. ఇంతకీ ఆ ఫోన్‌ కాల్స్‌ ఎవరు చేశారంటే..?

‘‘సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) నటించిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan)లో తొలుత నాకు అవకాశం ఇచ్చారు. మరొక రోజులో అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉండగా, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. నా స్థానంలో వేరే వాళ్లను తీసుకుంటున్నామని చెప్పారు. ఇది తొలిసారి కాదు.. ‘అంథిమ్‌’ టైమ్‌లోనూ ఈ టీమ్‌ ఇలాగే చేసింది. అప్పుడు కూడా ఆఫర్‌ ఇచ్చినట్టే ఇచ్చి..  మరో రెండు వారాల్లో షూట్‌ మొదలు కానుందనగా ఫోన్‌ చేసి వేరే వారిని తీసుకుంటున్నామని చెప్పింది. నేను వాళ్లను తప్పుబట్టడం లేదు. ఎందుకంటే, తమ సినిమాలో ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా వారి సొంత నిర్ణయం. కాకపోతే నేను ఎంతో బాధపడ్డా. నేనూ మనిషినే. నాక్కూడా భావోద్వేగాలు ఉంటాయి. రెండోసారి కూడా కల నెరవేరకపోతే తప్పకుండా బాధగానే ఉంటుంది కదా’’ అని అవికా వివరించారు. ఇక ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’, ‘అంథిమ్‌’ చిత్రాలు సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పైనే నిర్మితమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని