Pushpa: ‘కాంతార’లో భూతకోల.. అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ లుక్‌ వెనుక కథ ఇదేనా..?

పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)లోని హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) ఫస్ట్‌ లుక్‌ చూశారా..! యావత్‌ సినీ అభిమానుల్ని ఆశ్చర్యపరిచిన ఆ లుక్‌ వెనుక కథేంటో మీకు తెలుసా..?

Updated : 11 Apr 2023 11:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌డమ్‌ రాకముందు ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం వేరు. అగ్ర నటుల జాబితాలో చేరిన తర్వాత ప్రయోగాలు చేయడం వేరు. స్టార్‌ క్రేజ్‌ సంపాదించుకున్న హీరో సాహసోపేతమైన కథలో నటించాలన్నా, ఎక్స్‌పెరిమెంటల్‌ రోల్‌లో కనిపించాలన్నా.. ఎన్నో లెక్కలేసుకోవాలి. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించినవైతే ఆ లెక్కలు మరింత ఎక్కువ. ఇటీవల.. ‘కాంతార’ (Kantara)తో కన్నడ హీరో రిషబ్‌శెట్టి (Rishab Shetty) ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఒక్క లుక్‌తోనే అల్లు అర్జున్‌ ‘పుష్ప’ (Pushpa 2) చిత్రంపై అంచనాలు పెంచారు. మరి, ఆయా ‘అవతారాల’ నేపథ్యం గురించి తెలుసుకుందామా..?

కాంతారలో అలా..

కర్ణాటకలోని తుళునాడు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల గురించి ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం ‘కాంతార’. ప్రకృతి - మానవాళి మధ్య సత్సంబంధాలు ఉండాలని, ప్రకృతిని నాశనం చేయాలనుకుంటే మానవజాతి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఇతివృత్తంతో రూపొందిన ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో రిషబ్‌.. పంజుర్లిగా నట విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. ముఖమంతా పసుపు పూసుకుని, కిరీటం పెట్టుకుని, మెడలో మల్లెపూలు, కనకాంబరాల దండలు వేసుకుని, కత్తిరించిన కొబ్బరి ఆకులను దుస్తులుగా ధరించి.. ‘ఓఁ’ అని అంటూ ఉంటే ప్రేక్షకులంతా తన్మయత్వానికి లోనయ్యారు. ఆ సంప్రదాయమేంటో తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపారు. దీనికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.

పూర్వం తుళునాడులో అడవి పందులు ఎక్కువగా సంచరించేవని, ఓ పంది తన పంటను నాశనం చేస్తుందని కోపోద్రిక్తుడైన స్థానిక రైతు దాన్ని చంపేశాడని, కొంతకాలం తర్వాత.. తాను చేసింది తప్పు అని ఆవేదన చెందిన ఆ రైతు పంది ఆత్మను పూజించడం ప్రారంభించాడని, ఆ తర్వాత స్థానికులంతా వరాహాన్ని దైవంలా కొలిచేవారని కొందరు చెబుతుంటారు. మరోటి ఏంటంటే..? ఓ మగ పంది, ఓ ఆడ పంది కలిసి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్లి ప్రార్థించగా.. వాటి భక్తిని మెచ్చిన స్వామి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడట. వాటి కోరికను సుబ్రహ్మణ్య స్వామి నెరవేర్చాడని, వాటికి నాలుగు పిల్లలు పుట్టాయని, వాటిల్లో ఒకటి.. ఈశ్వరుడి తోటలో ప్రవేశించిందని, పార్వతికి బాగా నచ్చడంతో శివుడు దాన్ని ఆమెకు కానుకగా ఇచ్చాడని, తర్వాత కైలాసంలోని తోటలను నాశనం చేయడంతో ఆగ్రహించిన శివుడు ఆ పంది పిల్లని చంపేశాడని అక్కడి ప్రజలు అంటుంటారు. ఆ ఘటనకు ఎంతో బాధపడిన పార్వతి ఆ పందిని తిరిగి తీసుకురావాలని కోరగా పరమేశ్వరుడు దానికి ప్రాణం పోసి, దైవిక శక్తిని ప్రసాదించి, పంజుర్లిగా భూమ్మీదకు పంపించాడని, మానవులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ దైవరూపాన్ని ప్రార్థిస్తే పరిష్కారం లభిస్తుందనేది తుళునాడు ప్రజల విశ్వాసం. ప్రాంతాన్ని బట్టి అన్నప్ప పంజుర్లి, కద్రి పంజుర్లి, కాంతవర పంజుర్లి.. ఇలా పేర్లు మారుతూ ఉంటాయి. ఆ దైవాన్ని పూజించే ప్రత్యేక సంగీత నాట్యకళే భూతకోల. దానికి దైవ కోల, నేమ అనే పేర్లూ ఉన్నాయి. పంజుర్లితోపాటు క్షేత్రపాలకుడిగా గుళిగను కూడా శివుడు పంపించాడని, తప్పు చేసిన వారిని పంజుర్లి వదిలిపెట్టినా గుళిగ వదలదు అని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.

పుష్ప 2లో ఇలా..

అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘పుష్ప 2’లోని అతడి ఫస్ట్‌లుక్‌ చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. చీర కట్టుకుని.. చేతులకు గాజులు, చెవులకు దుద్దులు, ముక్కు పుడకలు, మెడలో హారంతోపాటు పూల దండతో కనిపించడంతో బన్నీ.. మహిళ పాత్ర పోషించి ఉంటారని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ, అది కాదు. ‘పుష్ప’ తొలి భాగం చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో సాగే ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. కొనసాగింపు సినిమా కాబట్టి ‘పుష్ప 2’లోనూ చిత్తూరు, తిరుపతి బ్యాక్‌డ్రాప్‌ ఉంటుంది. టైటిల్‌ లోగో పరిశీలిస్తే విదేశాలతో ముడిపడిన కథ కూడా అని అర్థమవుతుంది. అంతగా ఆశ్చర్యానికి గురిచేసిన బన్నీ గెటప్పు.. చిత్తూరు/తిరుపతి కల్చర్‌కి సంబంధించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జరిగే అతి ముఖ్యమైన పండగల్లో గంగమ్మ జాతర ఒకటి. అమ్మవారికి మొక్కుకొని మగవారు చీర కట్టుకుని.. లిప్‌స్టిక్‌, గోళ్లరంగు వేసుకుని ఆడవారిలా కనిపించడం అక్కడి సంప్రదాయం. అలా ముస్తాబైన వారు ఉట్టి పట్టుకుని గంగమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. చివరిగా దిష్టి తీసి ఉట్టిని పగలగొడతారు. పెద్దవారే కాదు చిన్నారులు కూడా విభిన్న వేషధారణలో కనిపిస్తుంటారు. ఆ సంప్రదాయం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. తిరుపతిలో ఏడు గంగమ్మ ఆలయాలున్నాయి. అవిలాలలో గంగమ్మ జన్మిస్తుంది. తాతయ్యగుంట దగ్గర ఉన్న గంగమ్మను చిన్న గంగమ్మగా పిలుస్తారు. ఇక్కడే జాతర జరుగుతుంది. కలియుగ శ్రీనివాసునికి గంగమ్మ చిన్న చెల్లెలు. దీంతో ప్రతి ఏటా జరిగే జాతర ఉత్సవాలకు కొండపైనున్న శ్రీవేంకటేశ్వరుని ఆలయం నుంచి కానుకలు రావడం సంప్రదాయంగా ఉంది.

కొన్ని వందల ఏళ్ల క్రితం తిరుపతి, పరిసర పల్లెలను పాలెగాళ్లు పరిపాలించేవారు. మహిళల్ని వేధించేవారు. తమ కన్ను పడిన వారిపై అత్యాచారానికి పాల్పడేవారు. తిరుపతిని పాలించే పాలెగాడు మరింత దుర్మార్గంగా ఉండేవాడు. వీడి దురాగతాల నుంచి రక్షించేందుకు గంగమ్మ పుట్టిందట. యుక్త వయసు వచ్చాక ఆమె మీదా పాలెగాడి దృష్టి పడుతుంది. అయితే పాలెగాడిపై ఆమె ఉగ్రరూపం దాల్చడంతో వాడు పారిపోయి దాక్కున్నాడు. పాలెగాడిని బయటకు రప్పించేందుకు రోజుకు ఒక వేషం చొప్పున అమ్మవారు ధరించారు. మొదటి రోజు బైరాగి వేషం ధరిస్తుంది. ఆ తర్వాత నాలుగోరోజు దొర వేషం ధరించి దొర కంఠంతో అరుస్తుంది. ఆ అరుపు విన్న వెంటనే పాలెగాడు తమ దొర వచ్చాడని బయటకు వస్తాడు. వెంటనే గంగమ్మ ఉగ్రరూపం దాల్చి వాడిని చంపుతుంది. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఏప్రిల్‌, మేలో జాతర జరుగుతుంటుంది. ఈ నేపథ్యానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ ‘పుష్ప 2’లో చూపించనున్నారని సమాచారం. ‘లుక్కే ఇలా ఉంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో’ అంటూ యావత్‌ సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు