Chiranjeevi: చిరు సినిమా ఓపెనింగ్‌కు ముగ్గురు అగ్ర హీరోలు

చిత్ర పరిశ్రమలో ఒక హీరో చిత్ర ప్రారంభోత్సవానికి మరొక హీరో వచ్చి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతూనే ఉంటుంది.

Updated : 27 Jun 2023 19:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిత్ర పరిశ్రమలో ఒక హీరో చిత్ర ప్రారంభోత్సవానికి మరొక హీరో వచ్చి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతూనే ఉంటుంది. కానీ, చిరంజీవి (Chiranjeevi) సినిమా కోసం ఏకంగా ముగ్గురు అగ్రహీరోలు వచ్చి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. చిరంజీవి, దర్శకుడు విజయ బాపినీడు కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మిగిలిన సినిమాలు కూడా విజయవంతమైనా ‘బిగ్‌బాస్‌’ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత మళ్లీ చిరంజీవితో సినిమా తీయాలని విజయబాపినీడు ప్రయత్నించారు కానీ వర్కవుట్ కాలేదు. తన సినిమాలకు విజయ బాపినీడు పెట్టే టైటిల్స్ విభిన్నంగా ఉంటాయి. ‘డాక్టర్. ముద్దుకృష్ణ’ పేరుతో చిరంజీవి హీరోగా ఒక సినిమా ప్లాన్ చేశారు. కానీ, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

చిరంజీవి విజయబాపినీడు కాంబినేషన్‌ వచ్చిన మరో హిట్ మూవీ ‘ఖైదీ నంబర్ 786’. ఈ చిత్రం షూటింగ్ 1987 అక్టోబర్‌ 25న వాహినీ స్టూడియోలో మొదలైంది. ఈ ప్రారంభోత్సవానికి ముగ్గురు అగ్ర హీరోలు కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు హాజరు కావడం విశేషం. హీరోలందరితో విజయబాపినీడుకు మంచి రిలేషన్స్ ఉండడం వల్లే ఈ కల సాధ్యమైంది. చిరంజీవి, భానుప్రియపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు కృష్ణంరాజు కెమెరా స్విచ్‌ ఆన్ చేయగా, శోభన్‌బాబు తొలి క్లాప్ ఇచ్చారు. హీరో కృష్ణ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.

ఇలా నలుగురు అగ్రహీరోలు ఒకే వరుసలో నిలబడి గ్రూప్ ఫొటో దిగడం అభిమానులకు ఆనందం కలిగించిన అంశం. నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజున అంటే 1988 జూన్ 10న ‘ఖైదీ నంబర్ 786’ విడుదల కావడం గమనార్హం. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సినిమాకు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఉన్నట్లే ఈ చిత్రం శత దినోత్సవాన్ని ఉదయం, సాయంత్రం కూడా నిర్వహించి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు దర్శకుడు విజయబాపినీడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని