షారూఖ్‌ కార్లు.. ఖరీదెంతో తెలుసా?

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారూఖ్‌ మొత్తం సంపాదన ఎంతో మీకు తెలుసా? పోనీ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం

Published : 09 Mar 2021 15:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారూఖ్‌ మొత్తం సంపాదన ఎంతో మీకు తెలుసా? పోనీ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడో తెలుసా? ఈ రెండింటిపై క్లారిటీ లేదా? పోనీ అతగాడు వాడుతున్న కార్ల విలువెంతో తెలుసా?  ఖాన్‌ గ్యారేజీలో ఉండే కార్ల విలువ అక్షరాలా రూ. 34 కోట్లు. నమ్మకం కలగడం లేదా?

బుగాటీ వేరాన్‌: ధర రూ: 12కోట్లు

ప్రపంచంలో అత్యంత వేగంగా దూసుకెళ్లే కార్లలో బుగాటీ వేరాన్‌ ముందువరుసలో ఉంటుంది. దీని డిజైన్‌, తయారీ అంతా జర్మనీలోనే. ఈ పంచకళ్యాణిపై మనసు పడి మరీ అక్కడి నుంచి తెప్పించాడు ఖాన్‌. తన అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులు కూడా చేయించుకున్నాడు. ఇలాంటి కారు ఇండియా సెలబ్రిటీలలో షారూఖ్‌ ఒక్కడి దగ్గరే ఉంది.

రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ డ్రాప్‌హెడ్‌ కూపె: ధర రూ.10కోట్లు

అంతర్జాతీయ స్టార్లు ఇష్టపడే మోడల్‌ ఇది. కిమ్‌ కార్దాషియన్‌, డేవిడ్‌ బెక్‌హాం, జెన్నిఫర్‌ లోపెజ్‌లాంటి అంతర్జాతీయ స్టార్లు ఇష్టపడ్డ కారు ఇది. వాళ్లకన్నా నేనేం తక్కువ అనుకున్నాడేమో.. ఈ బ్రిటీష్‌ లగ్జరీ కారును సొంతం చేసేసుకున్నాడు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, మన మెగాస్టార్‌ చిరంజీవి దగ్గర కూడా ఈ కారు ఉంది.

బెంట్లే కాంటినెంటల్‌ జీటీ: ధర రూ: 5.2కోట్లు

మార్కెట్లో అందుబాటులో ఉన్న విలాసవంతమైన సెడాన్‌లలో ఇదొకటి. 4.0లీటర్ల వీ8 ట్విన్‌ టర్బో ఇంజిన్‌, 500 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. షారూఖ్‌ షూటింగ్‌కి వెళ్తున్నప్పుడు ఎక్కువగా ఈ కారును వినియోగిస్తుంటాడు.

బీఎండబ్ల్యూ 18: ధర రూ: 2.29 కోట్లు

షారూఖ్‌ తన భార్య గౌరీ ఖాన్‌ పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చిన బండి. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ కారు. సచిన్‌ తెందుల్కర్‌, శిల్పాశెట్టిలు సైతం ఈ కారును వినియోగిస్తున్నారు.

బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ కన్వర్టిబుల్‌

బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి తను సొంతం చేసుకున్న మరో మోడల్‌ ఇది. ముంబయిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ కారులోనే చక్కర్లు కొడుతుంటాడు షారూఖ్‌. శక్తిమంతమైన 4.4 లీటర్ల వీ8 ట్విన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో పరుగెత్తుతుంది. ఐదు సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.

రేంజ్‌రోవర్‌ వోగ్‌: ధర రూ: 2కోట్లు

ఈ మోడల్‌ని బెస్ట్‌ ఎస్‌యూవీల్లో ఒకటిగా చెబుతుంటారు. దీన్ని నడిపిస్తూ చాలాసార్లు కెమెరాలకు చిక్కాడు షారూఖ్‌. దీని అత్యధిక వేగం గంటకు 250కిలోమీటర్ల పైనే.

హ్యుందాయ్‌ క్రెటా 2020: ధర రూ: 12 లక్షలు

షారూఖ్‌ హ్యుందాయ్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రచారం చేయడమే కాదు.. ప్రత్యక్షంగా ఆ కారును వినియోగించాలనే ఉద్దేశంతో ఖరీదు చేశాడు. హ్యుందాయ్‌ కంపెనీ క్రెటాని షారూఖ్‌కి బహుమతిగా ఇచ్చింది అంటుంటారు. - ఇవి కాకుండా ఖాన్‌ గ్యారేజీలో చిన్నాచితకావి మరో ఐదు కార్లున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని