RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై బ్రెజిల్‌ అధ్యక్షుడి ప్రశంసలు.. వీడియో వైరల్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)ను ఉద్దేశిస్తూ బ్రెజిల్‌ అధ్యక్షుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని అన్నారు.

Published : 10 Sep 2023 14:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)పై బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా ప్రశంసల వర్షం కురిపించారు. తనకెంతో నచ్చిన భారతీయ చిత్రం ఇదేనని ఆయన అన్నారు. సినిమా అద్భుతంగా ఉందన్న ఆయన చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.
‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నాకు బాగా నచ్చంది. 3 గంటలు నిడివి ఉన్న ఫీచర్‌ ఫిల్మ్‌ ఇది. అద్భుతమైన సన్నివేశాలు, అందమైన డ్యాన్సులు ఇందులో ఉన్నాయి. భారత్‌పై బ్రిటిష్‌ కంట్రోల్‌ను తెలియజేస్తూ లోతైన విమర్శ చేసినప్పటికీ.. దానిని కూడా అర్థవంతంగా చూపించారు. ఆ సినిమా చూసిన తర్వాత.. తెలిసిన వాళ్లందరినీ.. ‘మీరు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వీక్షించారా?’ అని మొదట అడిగా. ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా నేను ఎంజాయ్‌ చేశా. చిత్రదర్శకుడు, నటీనటులకు నా అభినందనలు’’ అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

కాగా, దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘‘మా చిత్రంపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్యూ సర్‌. మీ ప్రశంసలతో మా టీమ్‌ మొత్తం ఎంతో ఆనందిస్తుంది’’ అని పేర్కొంది.

ఎట్టకేలకు ఓటీటీలోకి ‘భోళా శంకర్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

కొమురం భీమ్‌ - అల్లూరి సీతారామరాజు ఫిక్షనల్‌ కథతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సిద్ధమైంది. రాజమౌళి దర్శకుడు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అలియా భట్‌ సీతగా కనిపించారు. ఎన్నో అంచనాల మధ్య గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని