Krishna: ‘ఖైదీ’లో హీరోగా మొదట కృష్ణను ఎంపిక చేశారు.. కానీ..

నేడు సూపర్‌ స్టార్‌ కృష్ణ (krishna) వర్ధంతి సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రాలకు సంబంధించిన కొన్ని సంగతులను మేకప్‌ మ్యాన్‌ పంచుకున్నారు.

Updated : 15 Nov 2023 12:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన నటుడు కృష్ణ (krishna). అర్ధ శతాబ్దం పాటు తన సత్తా చాటిన ఈ లెజెండరీ నటుడు లోకాన్ని వీడి అప్పుడే ఏడాది గడిచింది. నేడు ఆయన తొలి వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తున్నారు. అలాగే ఎంతోకాలం కృష్ణకు వ్యక్తిగత మేకప్‌మ్యాన్‌గా పనిచేసిన మాధవరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘ఆంధ్రా జేమ్స్‌బాండ్‌’గా లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్న కృష్ణ తనకు వచ్చిన అవకాశాల్లో కొన్ని సినిమాలకు వేరే నటీనటులను తీసుకోవాలని సలహా ఇచ్చేవారట. అలా ఆయన వదులుకున్న సినిమాల గురించి మాధవరావు తాజాగా మాట్లాడారు. చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో ‘ఖైదీ’ (Khaidi) ఒకటి. మొదట ఈ సినిమా స్క్రిప్ట్‌ కృష్ణ దగ్గరకు వచ్చిందట. కానీ, నిర్మాతలకు చిరంజీవిని తీసుకోవాలని ఆయన సూచించారట. చిరంజీవి (Chiranjeevi) డ్యాన్స్ బాగా చేస్తారని.. అతడినే తీసుకోవాలని సూపర్‌స్టార్‌ కృష్ణ చెప్పినట్లు మాధవరావు చెప్పారు. ఆ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే కృష్ణంరాజు హీరోగా నటించిన ‘కటకటాల రుద్రయ్య’ సినిమా కోసం దర్శకనిర్మాతలు మొదట కృష్ణని సంప్రదించారట. ఆయన కృష్ణంరాజుకు అయితే ఆ స్క్రిప్ట్‌ బాగుంటుందని సూచించారట. ఆ సినిమా రిలీజ్‌ అయ్యాక థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి కృష్ణంరాజు నటనను ప్రశంసించారట. అలా ఆయన వద్దకు వచ్చిన స్క్రిప్ట్‌లకు ఏ హీరో అయితే సరిపోతారో సూచించేవారట కృష్ణ. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయనది గొప్ప మనసంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు